Kurnool District: నేను మోదీపై పోరాడుతుంటే కొందరు నాపైన ఫైట్ చేస్తున్నారు!: సీఎం చంద్రబాబు
- అన్ని కష్టాలకు రాష్ట్ర విభజనే కారణం
- కష్టపడి పనిచేస్తున్నాం .. ఇంకా కష్టాలు పూర్తిగా తీరలేదు
- నేను మోదీపై పోరాడుతుంటే కొందరు నాపై ఫైట్ చేస్తున్నారు!
- రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదు
మనం సమస్యలతో ముందుకెళ్తున్నామని, దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మనమే వెనుకబడిపోయామని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, అన్ని కష్టాలకు రాష్ట్ర విభజనే కారణమని, కష్టపడి పనిచేస్తున్నామని, ఇంకా కష్టాలు పూర్తిగా తీరలేదని అన్నారు.
మోదీ మనకు అన్యాయం చేస్తారని కలలో కూడా ఊహించలేదని, నాలుగు కేంద్ర బడ్జెట్ల వరకూ వేచి చూసి, ఐదో బడ్జెట్ లోనూ మొండిచేయి చూపేసరికి ధర్మపోరాటానికి నాంది పలికానని చెప్పారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల కోసమే ఆలోచిస్తున్నానని, భావితరాల భవిష్యత్ కోసమే కృషి చేస్తున్నానని అన్నారు.
‘మీ అందరికీ వాస్తవాలు చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. నేను నరేంద్ర మోదీపై పోరాడుతుంటే కొందరు నాపైన ఫైట్ చేస్తున్నారు. ఇది న్యాయమా? నన్ను నిర్వీర్యం చేస్తే మీకేమొస్తుంది?’ అని ప్రశ్నిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ‘నరేంద్ర మోదీకి మనపై ఎందుకు కోపమో మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుజరాత్ ను అధిగమిస్తామనా? లేకపోతే, ఆయనకు ఇష్టం లేదా? ఆయన చెప్పుచేతల్లో మనం ఉండమనా? రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదు’ అని చంద్రబాబు మండిపడ్డారు.