Auto: ఆటో ట్రాలీలో రూ. 40 కోట్లు... నల్గొండ ఎస్బీఐ అధికారుల నిర్వాకం!
- రక్షణ లేకుండా తరలించేందుకు ఏర్పాట్లు
- పోలీసులకు సమాచారం ఇచ్చిన పౌరులు
- బ్యాంకు అధికారులను నిలదీసిన పోలీసులు
- ఆపై సెక్యూరిటీ ఇచ్చి నగదు తరలింపు
ఓపెన్ ట్రాలీలో ఎటువంటి రక్షణా లేకుండా 40 కోట్ల రూపాయలను తరలించేందుకు నల్గొండ జిల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు సిద్ధపడటం, ఆపై విషయం తెలిసి పోలీసులు అడ్డుపడటం చర్చనీయాంశమైంది. గురువారం నాడు, జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుంచి రూ. 40 కోట్లను గ్రామీణ వికాస్ బ్యాంకుకు తరలించేందుకు ఆటో ట్రాలీలో నోట్ల కట్టలను సర్దారు. ఇవి బయటకు కనిపించకుండా కనీసం ఓ టార్పాలిన్ కప్పాలన్న ఆలోచన కూడా అధికారులకు రాలేదు.
ఈ విషయాన్ని గమనించిన కొందరు, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా, సీఐ, ఎస్ఐ తదితరులు రంగంలోకి దిగారు. ఇంత భారీగా నగదును సెక్యూరిటీ లేకుండా ఎలా పంపుతున్నారని నిలదీశారు. నగరంలోని మరో ప్రాంతానికే అయినా, సెక్యూరిటీ లేకుండా పంపడం సరికాదని, తమకు సమాచారం ఇవ్వాల్సి వుందని అన్నారు. ఆపై సెక్యూరిటీని ఏర్పాటు చేసి డబ్బును తరలించారు.