Telugudesam: మరికొన్ని రోజుల్లోనే... ఏపీలో రాజకీయం అనూహ్యంగా మారుతుంది, చూడండి: బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
- 2004లో ఎదుర్కొన్న పరిస్థితులను టీడీపీ ఎదుర్కోనుంది
- కేంద్ర సాయం గురించి చెప్పకుండా ఏకపక్ష ప్రచారం
- బీజేపీ సాయం లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం?
- నిప్పులు చెరిగిన జీవీఎల్ నరసింహరావు
నవ్యాంధ్ర రాజకీయాల్లో మరికొన్ని రోజుల వ్యవధిలో అనూహ్య మార్పులు సంభవించనున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మార్పులను ఆహ్వానించేందుకు అన్ని రాజకీయ పార్టీలూ రెడీగా ఉండాలని అన్నారు. కొంత కాలంగా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రచారం చేసుకుంటోందని, 2019లో తెలుగుదేశం పార్టీకి ఇక్కట్లు తప్పవని అన్నారు. పక్క రాష్ట్రంలోని పరిస్థితులే ఇక్కడ కూడా రానున్నాయని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయం గురించి ఎక్కడా మాట్లాడటం లేదని, కేంద్రం లేకుండా రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమైందో చెప్పాలని ప్రశ్నించారు.
సిగ్గులేకుండా కేంద్ర సాయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు కర్ణాటకలో బీజేపీని ఓడించే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులను వాడుకున్నారని ఆరోపించారు. కేంద్ర నిధులతో విదేశీ యాత్రలు చేసే బదులు, ఆ డబ్బును వ్యవసాయానికి ఇస్తే బాగుండేదని అన్నారు. తెలుగుదేశం అహంకారం, తప్పుడు నిర్ణయాలతో బీజేపీకి ఎటువంటి నష్టం రాదని, 2004లో ఎదురైన పరిస్థితులను వచ్చే సంవత్సరం టీడీపీ ఎదుర్కోనుందని అన్నారు. చంద్రబాబుపై కక్ష పెంచుకున్నది తాము కాదని, ప్రజలని, వారే కక్ష తీర్చుకుంటారని అన్నారు. అబద్ధాల రాజకీయాలు చేసే టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని జీవీఎల్ నరసింహరావు హెచ్చరించారు.