sivaji: ప్రత్యేక హోదా కోసం 'గొడుగు' సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చిన హీరో శివాజీ
- హోదా కోసం ఒక రాత్రి జాగారం కార్యక్రమం చేపట్టిన శివాజీ
- వేదికపై పెద్ద గొడుగు పెట్టి, దాని కింద అన్ని పార్టీల జెండాలు ఉంచిన వైనం
- అన్ని పార్టీలు ఏకమై పోరాడాలంటూ పిలుపు
ఏపీకి ప్రత్యేక హోదా కోసం నటుడు శివాజీ నిన్న రాత్రి జాగారం చేశారు. ఈ సందర్భంగా వేదికపై ఆయన ఒక పెద్ద గొడుగును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాల జెండాలను గొడుకు కింద ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీలన్నీ ఎవరికి వారుగా పోరాడితే రాష్ట్రానికి హోదా రాదని ఆయన చెప్పారు. అన్ని పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చి, పోరాటం చేస్తే 2019లోపే ప్రత్యేక హోదాను సాధిస్తామని అన్నారు.
మనకు ప్రత్యేక హోదా రాకపోతే ఏపీ మరో బీహార్ అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏపీని అన్యాయంగా విడదీసిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హోదాతోపాటు, విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పిన బీజేపీ... ఆ తర్వాత మోసం చేసిందని చెప్పారు. ఏపీకి బీజేపీ ఏమీ చేయదనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను గతంలోనే చెప్పానని... 'సార్, నేను బీజేపీ నుంచి బయటకు వచ్చాను. వాళ్లు ఏపీకి ఏమీ చేయరు' అని చెప్పానని శివాజీ తెలిపారు.
అయితే, ప్యాకేజీకి ఒప్పుకోకపోయుంటే ఈ మాత్రం నిధులు కూడా రాష్ట్రానికి వచ్చుండేవి కాదని చంద్రబాబు చెప్పారని అన్నారు. అన్ని పార్టీలు కలసి ఇప్పుడు సమైక్యంగా హోదా కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఒక రాత్రి జాగారం కార్యక్రమం చేపట్టిన శివాజీకి పలువురు నేతలు తమ మద్దతు ప్రకటించారు.