Amitabh Bachchan: కథువా ఘటనపై మాట్లాడాలని అమితాబ్ బచ్చన్‌ని కోరాను.. కానీ మాట్లాడలేదు: ప్రకాశ్‌రాజ్
- అలా అడగడం ఓ పౌరుడిగా నా హక్కు
- ఇటువంటి విషయాల గురించి తాను మాట్లాడనని అన్నారు
- అమితాబ్ అలా అనకూడదు
- ఆయన మాట్లాడితే బాగుండేది
జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఓ బాలికను కొందరు యువకులు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ను ఈ విషయంపై మాట్లాడాలని తాను కోరానని, అయితే, ఆయన నోరువిప్పలేదని సినీనటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు.
తాజాగా ప్రకాశ్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... దీనిపై స్పందించమని అడగడం ఓ పౌరుడిగా అది తన హక్కని, కానీ, ఇటువంటి విషయాల గురించి తాను మాట్లాడనని అమితాబ్ అన్నారని చెప్పారు. అమితాబ్ అలా అనకూడదని, ఎందుకంటే తన ఉద్దేశంలో కథువా ఘటన మత విభేదాల నేపథ్యంలో జరిగింది కాదని, ఓ ప్రాంతం నుంచి గెంటేయడానికి కొందరు వ్యక్తులు చేసిన అఘాయిత్యమని అన్నారు. తనకు అమితాబ్ బచ్చన్ అంటే చాలా గౌరవమని, ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తే తనకేం వస్తుందని అన్నారు. ఆ ఘటనపై అమితాబ్ మాట్లాడితే బాగుండేదని వ్యాఖ్యానించారు.