Rajasthan Royals: రంగుమార్చి గెలిచిన రాజస్థాన్.. చెన్నై విజయాలకు బ్రేక్!
- బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కోసం పింక్ జెర్సీ ధరించిన ఆర్ఆర్
- చివరి ఓవర్ వరకు విజయం దోబూచులాట
- రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం
ఐపీఎల్లో భాగంగా శుక్రవారం జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు పసందైన విందు అందించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి రాజస్థాన్‌దే పై చేయి అయింది. చెన్నై వరుస విజయాలకు రహానే సేన బ్రేక్ వేసి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఒక్క విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టే స్థితిలో చెన్నై.. ఆశలు సజీవంగా ఉండాలంటే విజయం తప్పని పరిస్థితుల్లో రాజస్థాన్ హోరాహోరీగా తలపడ్డాయి. బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కోసం పింక్ సిటీలో జరిగిన ఈ మ్యాచ్‌లో పింక్ జెర్సీతో బరిలోకి దిగిన రాజస్థాన్.. రంగుమార్చి విజయం అందుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ షేన్ వాట్సన్ 39, అంబటి రాయుడు 12, కెప్టెన్ ధోనీ 33, శామ్ బిల్లింగ్స్ 27 పరుగులు చేయగా, సురేశ్ రైనా మరోసారి తన ఫామ్‌ను కొనసాగించాడు. 35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో అర్ధ సెంచరీ (52) సాధించాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టగా, ఇష్ సోధీ ఓ వికెట్ నేలకూల్చాడు.
అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జోస్ బట్లర్ మరోమారు చెలరేగిపోయాడు. 60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 95 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. బెన్ స్టోక్స్ 11, కెప్టెన్ రహానే 4, సంజు శాంసన్ 21, ప్రశాంత్ చోప్రా8, స్టువార్ట్ బిన్నీ 22, కృష్ణప్ప గౌతమ్ 13 పరుగులు చేశారు.
చివరి వరకు విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడింది. చివరి రెండు ఓవర్లలో రాజస్థాన్ విజయానికి 28 పరుగులు అవసరం కావడంతో చెన్నై విజయం తథ్యం అని అందరూ భావించారు. అయితే 19వ ఓవర్ వేసిన డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో కృష్ణప్ప గౌతమ్ రెండు సిక్సర్లు బాదడంతో విజయం రాజస్థాన్ వైపు మళ్లినా చివరి బంతికి అతడు అవుటవడంతో మళ్లీ ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లో మూడు బంతులకు 10 పరుగులు చేయాల్సిన తరుణంలో బ్రావో వేసిన మూడో బంతికి రెండు పరుగులు సాధించిన బట్లర్ తర్వాతి బంతిని సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను తిరిగి తమ చేతుల్లోకి లాక్కున్నాడు. ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు రావడంతో విజయం పూర్తయింది. మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించిన బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.