Karnataka: కర్ణాటక ఎన్నికలు .. మొరాయించిన ఈవీఎంలు!
- ఆరు పోలింగ్ కేంద్రాల్లో మొరాయించిన ఈవీఎంలు
- వాటి స్థానే వేరే వాటిని అమర్చిన అధికారులు
- బళ్లారిలో ఓటర్లను ప్రలోభపెడుతున్న బీజేపీ అభ్యర్థి!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అయితే, కర్ణాటకలోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది. హుబ్లీ, గుర్మిత్కల్, షిమోగాతో పాటు మరో మూడు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో, మొరాయించిన ఈవీఎంలను తొలగించి వాటి స్థానే వేరే వాటిని ఉంచి పోలింగ్ ను పునరుద్ధరించారు.
ఇదిలా ఉండగా, బళ్లారిలోని బాలభారతి పాఠశాల పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి సోమశేఖర్ రెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. ఓటరు స్లిప్పుతో పాటు బీజేపీకి ఓటేయాలని కోరుతూ సోమశేఖర్ రెడ్డి ఫొటోతో ఉన్న స్లిప్పులను పంపిణీ చేశారు. ఓటర్లు ఆ స్లిప్పులతో ఓటింగ్ కేంద్రాలకు రావడంపై పిరమిడ్ పార్టీ అభ్యర్థి విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.