Kadiam Srihari: తెలంగాణ రాకముందు వ్యవసాయం దండగగా ఉంటే...ఇప్పుడు పండగలా ఉంది: కడియం శ్రీహరి
- గతంలో ఏ ప్రభుత్వమైనా రైతును పట్టించుకుందా?
- తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్
- పంట రుణ మాఫీ, ఎరువులు-విత్తనాలు ఇస్తున్నాం
- ఇటువంటి పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవు
'తెలంగాణ రాష్ట్రం సాధించుకోకముందు వ్యవసాయం ఎలా ఉండేది? రైతన్నకు సరైన కరెంటు రాక, పొలాలు ఎండిపోయేవి, విత్తనాలు, ఎరువుల కోసం క్యూలో గంటలు, రోజుల కొద్ది నిలబడాల్సి వచ్చేది' అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.
"అప్పట్లో రైతుల రుణ మాఫీ లేదు, పంట పెట్టుబడి లేదు...రైతును పట్టించుకునే వారు లేరు... మరి తెలంగాణ వచ్చాక వ్యవసాయం పండగగా మారుతోంది... రైతును రాజు చేయాలన్న ధ్యేయంతో సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. క్యూలో నిలబడే పరిస్థితి లేకుండా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారు.
38 లక్షల మంది రైతులకు 17 వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశారు. తెలంగాణలో కోటి ఎకరాలను మాగాణి కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. రైతు అప్పు కోసం ఎవరి వద్దకూ వెళ్లాల్సిన పనిలేకుండా పంట పెట్టుబడిగా ఎకరానికి ఏడాదికి 8000 రూపాయలు ఇస్తున్నారు. ఇలాంటి పథకాలు దేశంలో ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? ఏ ముఖ్యమంత్రి అయినా రైతు గురించి ఇలా ఆలోచించారా?" అని కడియం శ్రీహరి ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
రైతు బంధు పథకంలో భాగంగా నేడు భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం, రామానుజాపురం గ్రామంలో, వరంగల్ రూరల్ జిల్లా, నర్సంపేట మండలం, బాంజీపేట గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి, ఎకరానికి రూ.4000 చొప్పున చెక్కులను అందించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ... "తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తోన్న కాంగ్రెస్, బీజేపీలు దేశంలో అనేక రాష్ట్రాల్లో పాలిస్తున్నాయి. మరి తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవసాయం కోసం అందిస్తోన్న 24 గంటల ఉచిత విద్యుత్, రైతుకు 17 వేల కోట్ల పంట రుణాలు, కోటి ఎకరాలకు సాగు నీరిచ్చే ప్రాజెక్టుల నిర్మాణం, పంట పెట్టుబడి వంటి పథకాల్లో ఏ ఒక్కటైనా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
అధికారంలో ఉన్నప్పుడు రైతును పట్టించుకోలేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు కోసం చేసే వాటికి మద్దతివ్వకుండా అవరోధాలు సృష్టిస్తున్నారు. తెలంగాణ రాకముందు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా నేను ఉన్న సమయంలో జనగామ జిల్లాల్లో ఇదే వేసవి కాలంలో ఉప్పలయ్య అనే రైతు ఎరువులు, విత్తనాల కోసం జనగామలోని ఒక షాప్ దగ్గర మూడు గంటల సేపు నిలబడ్డారు. తీరా అతను కౌంటర్ వద్దకు వచ్చే సరికి ఎరువులు అయిపోయాయని, పక్క షాపులో ఇస్తున్నారని చెప్పారు. దీంతో ఎరువుల కోసం కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ షాప్ కు పరుగెత్తుతూ మధ్యలోనే ఉప్పలయ్య కుప్పకూలి పోయి, అక్కడికక్కడే చనిపోయారు.
దీంతో అక్కడి ఎమ్మెల్యేగా ఉప్పలయ్యకు న్యాయం చేయాలని నేను ఆందోళన చేపట్టాను. అప్పుడు బుక్ అయిన కేసు ఇంకా ఉంది. కానీ, గత నాలుగేళ్లుగా ఏ ఒక్క రైతూ ఎరువులు, విత్తనాల కోసం క్యూలో నిలబడాల్సి వచ్చిందా? అని రైతులను ప్రశ్నించారు. రైతులకు ఎన్ని ఎరువులు, విత్తనాలు కావాలో ముందే అంచనా వేసి వాటిని స్టాక్ చేస్తోన్న ఏకైక సీఎం కేసీఆరే. పేదింటి ఆడపిల్ల పెళ్లి కోసం నాడు 51 వేల రూపాయలు ఇచ్చి, అవి సరిపోవడం లేదని కేసీఆర్ స్వయంగా ఆలోచించి దానిని గత ఏడాది నుంచి 75 వేల రూపాయలకు పెంచారు.
అవి కూడా సరిపోవడం లేదని గుర్తించి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దానిని 1,00,116 రూపాయలకు పెంచారు. ప్రభుత్వం అందరికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందేలా పనిచేస్తోంది. ఇలాంటి ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను నిండు మనసుతో అందరూ ఆశీర్వదించాలి" అని వ్యాఖ్యానించారు.