liquor: ఓటుకు రెండువేలు.. బోనస్‌గా మద్యం.. కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహం!

  • కర్ణాటకలో ఏరులై పారిన మద్యం, డబ్బు
  • అభ్యర్థిని బట్టి ఓటుకు ఎంత ఇవ్వాలో నిర్ణయం
  • గట్టి అభ్యర్థులు బరిలో ఉంటే పెరిగిన ఓటు ‘విలువ’

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన తర్వాత ఎన్నికల సిత్రాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఎన్నికల పుణ్యమా అని ఓటర్ల చేతుల్లోకి డబ్బు, మద్యం బాటిళ్లు వచ్చి చేరాయి. వివిధ పార్టీల కార్యకర్తలు ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు పంచడంతోపాటు బోనస్‌గా మద్యం సీసాలను కూడా చేతిలో పెట్టినట్టు స్వయంగా ఓటర్లే చెబుతుండడం గమనార్హం.

బ్యాత్రనారాయణపురకు చెందిన ఓ మహిళ నెలకు రూ.2వేల జీతంతో ఓ ఇంట్లో పనికి కుదిరింది. శుక్రవారం ఆమె ఇంటికి వచ్చిన ఓ పార్టీ కార్యకర్తలు చేతిలో రెండు వేలు పెట్టి తమ నాయకుడికే ఓటు వేయాలని చెప్పి చకచకా వెళ్లిపోయినట్టు ఆమె తెలిపింది. గత ఎన్నికల్లో ఓటుకు రూ.500 మాత్రమే ఇచ్చారని, ఈసారి కాంగ్రెస్, బీజేపీలు చెరో రూ.2వేలు పంచాయని పేర్కొంది.

ఓటుకు నోటు పంపకంలో పార్టీ నేతలు పలు విషయాలను పరిగణనలోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. అభ్యర్థి, అవసరమైన ఓట్లు తదితర వాటిని లెక్కించి ఓటు విలువను అంచనా వేసి ఆ మేరకు ఓటుకు ఎంత ఇవ్వాలనేది నిర్ణయించడం విశేషం.

బీటీఎం లే అవుట్‌లో హోంమంత్రి రామలింగారెడ్డి, బీజేపీ అభ్యర్థి లల్లేష్ రెడ్డితో పోటీపడుతున్నారు. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్‌రెడ్డి మేనల్లుడే లల్లేష్ రెడ్డి. ఈ నియోజకవర్గంలో అభ్యర్థిత్వాన్ని బట్టి ఓటుకు రూ.2వేలుగా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొంత ‘ధర్మబద్ధం’గా డబ్బులు పంపిణీ చేశారు. సమానత్వం పాటించి అందరికీ ఒకేలా పంచిపెట్టారు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోటీపడుతున్న బాదామి నియోజకవర్గంలోని శివారు గ్రామాల్లోని 300 ఇళ్లకు రూ.15 వేలు.. మందు బాటిళ్లు పంపిణీ చేశారు. ఇక్కడ సిద్ధరామయ్యపై బీజేపీ అభ్యర్థి బి.శ్రీరాములు పోటీలో ఉన్నారు. ఇక్కడ తొలుత ఓటుకు రూ.700 పంచగా, గ్రామస్థులు కుదరదని తేల్చి చెప్పడంతో చివరికి రూ.2 వేలు పంచిపెట్టినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News