China: పదేళ్ల క్రితం నాటి భూకంపంలో 87 వేల మంది మరణిస్తే చైనా ఆ విషయాన్ని వెల్లడించలేదు... ఉద్యమకారుడి ఆరోపణ!
- 2008 మే 12న సియాచిన్ లో భూకంపం
- 7.9 తీవ్రతతో ప్రకంపనలు
- మరణాలపై ఏనాడూ నిజం చెప్పని చైనా
- ఆరోపించిన హక్కుల కార్యకర్త
చైనాలోని సియాచిన్ ప్రావిన్స్ ప్రాంతంలో 2008 సంవత్సరంలో భారీ భూకం వచ్చి సుమారు 87 వేల మంది మరణించడమో లేదా కనిపించకుండా పోవడమో జరిగితే, చైనా ప్రభుత్వం సరైన వాస్తవాలను ప్రకటించలేదని హక్కుల కార్యకర్త అయ్ వీవీ ఆరోపించారు. "ఘటన జరిగి పదేళ్లయినా, మాకు సూటి సమాధానం ఇంతవరకూ రాలేదు. కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ చారిత్రక ఘటనపైనా అధికారికంగా వాస్తవాలు వెల్లడి కాలేదు" అని బెర్లిన్ లో న్యూస్ ఏజన్సీ 'ఏఎఫ్పీ' తో మాట్లాడిన వీవీ వ్యాఖ్యానించారు.
సియాచిన్ లో మే 12, 2008లో 7.9 తీవ్రతతో భూకంపం వచ్చిన తరువాత ఆ ప్రాంతానికి మొట్టమొదటిగా చేరుకున్న వారిలో వీవీ ఒకరు. నాటి ఘటనలను గుర్తు చేసుకున్న ఆయన, స్కూళ్లలో చదువుకుంటున్న 7 వేల మంది విద్యార్థులు పాఠశాల భవనాల కిందే నలిగిపోయారని, భవనాల నిర్మాణంలో నాణ్యత పాటించలేదని ఆరోపించారు. ఆ ప్రాంతంలో మరణాలపై విచారిస్తున్న తనను పోలీసులు అరెస్ట్ చేసి తీవ్రంగా కొట్టారని చెప్పారు. ఆపై ఏడాది తరువాత భూకంపంలో పాఠశాలలు కూలి 5,335 మంది మాత్రమే మరణించారని ప్రభుత్వం చెప్పిందని, మృతుల జాబితాను ఈ నాటికీ బయటపెట్టలేదని ఆరోపించారు. అధికారికంగా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని నెరవేర్చలేదని అన్నారు.