Pakistan: నేను చెప్పిందొకటి, రాసుకున్నది మరొకటి: ఇండియాపై ఉగ్రదాడుల విషయంలో మాట మార్చిన నవాజ్ షరీఫ్
- తలచుకుంటే ముంబై ఉగ్రదాడిని ఆపి ఉండే వాళ్లమన్న నవాజ్
- తీవ్ర విమర్శలు చేస్తున్న స్వపక్ష, విపక్షాలు
- నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం
- వివరణ ఇచ్చిన పాక్ మాజీ ప్రధాని
తాము తలచుకుంటే 2008లో ముంబైపై జరిగిన ఉగ్రదాడులను నిలువరించగలిగి ఉండేవాళ్లమని, పాక్ భూ భాగంపై ఉగ్రవాదులు స్థావరాలను ఏర్పాటు చేసుకున్న మాట వాస్తవమేనని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తాను చెప్పిన మాటలను మీడియా వక్రీకరించిందని అన్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూ ఇస్తూ, పాకిస్థాన్ లో మిలిటెంట్ సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయని, సరిహద్దులు దాటి ముంబైకి వెళ్లి ప్రజలను చంపే ఆలోచనను సమర్థించి వుండాల్సింది కాదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో, షరీఫ్ తరఫు ప్రతినిధి మీడియాకు వివరణ ఇస్తూ, "నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలను భారత మీడియా వక్రీకరించింది. దురదృష్టవశాత్తూ పాక్ లోని కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో కూడా ఇదే ప్రచారం జరిగింది. వాస్తవాలు తెలుసుకోకుండానే ఈ ప్రచారం జరిగింది. షరీఫ్ ప్రకటనలోని భావాన్ని భారత మీడియా పట్టించుకోలేదు" అని తెలిపారు. కాగా, దేశపు పరువు తీసేలా వ్యాఖ్యానించిన షరీఫ్ పై ఇప్పుడు విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా మండిపడుతున్నారు.