YSRCP: ఆనాడు నా డ్యూటీ నేను చేశానంతే... కేసు నిలబడుతుందా? అంటే ఏమీ చెప్పలేను!: జగన్ కేసులపై లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
- జగన్ అక్రమాస్తుల కేసును పర్యవేక్షించిన లక్ష్మీనారాయణ
- హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాఫ్తు చేశామంతే
- ఇప్పుడున్న అధికారులూ సమర్థులే
- ఇంతకన్నా ఇంకేమీ చెప్పలేనన్న సీబీఐ మాజీ జేడీ
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రస్తుత వైకాపా అధినేత, అప్పటి కాంగ్రెస్ ఎంపీ వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును విచారించిన నాటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, తాజాగా, ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న వేళ జగన్ కేసుల ప్రస్తావన రాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు జగన్ కేసులను విచారించిన అధికారిగా పేరు వచ్చినప్పటికీ, తాను ఆ ఇమేజ్ ని కోరుకోవడం లేదని చెప్పారు. నాడు తనకు అప్పగించిన డ్యూటీని తాను చేశానని, ఆనాడు తనపై ఏ విధమైన రాజకీయ ఒత్తిడులూ లేవని స్పష్టం చేశారు. ఆ కేసును తనకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, హైకోర్టు బెంచ్ నిర్ణయించి విచారించాలని అప్పగించిందని, ఎవరూ డైరెక్టుగా ఇచ్చిన కంప్లయింట్ కాదని గుర్తు చేశారు.
కేసులో అందుబాటులోని సాక్ష్యాధారాల ప్రకారం తాను డ్యూటీ చేశానని, తాను ఎంతో మంది అధికారులను పర్యవేక్షించే బాధ్యతలను చేపట్టానని, క్షేత్రస్థాయిలో ఎంతోమంది అధికారులు జగన్ కేసులపై దర్యాఫ్తు చేశారని లక్ష్మీనారాయణ వెల్లడించారు. తాను ఆ పదవి నుంచి బయటకు వచ్చిన తరువాత, ఎంతో మంది అధికారులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారని, దీంతో జగన్ కేసు బలహీనపడి, వీగిపోతుందని పలువురు భావిస్తున్నారన్న వార్తలపై స్పందిస్తూ, ఆ విషయంలో తానేమీ వ్యాఖ్యానించలేనని, ఇప్పుడున్న అధికారులు కూడా సమర్థవంతంగా పనిచేస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారనే అనుకుంటున్నానని తెలిపారు. తాను పనిచేసినంత కాలం ఏ ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి రాలేదని స్పష్టం చేశారు.