Karnataka: యడ్యూరప్పపై తొలగిన అవినీతి మరక... 'గాలి'పైనా కనిపించని వ్యతిరేకత!
- గతంలో జైలుకు వెళ్లి వచ్చిన యడ్యూరప్ప
- తమ ఓట్లతో అవినీతి మరకను తుడిచేసిన కన్నడిగులు
- బళ్లారి ప్రాంతంలో కొనసాగిన గాలి సోదరుల హవా
పదేళ్ల క్రితం కర్ణాటకలో బీజేపీ అధికారం చేపట్టిన తరువాత, యడ్యూరప్ప సీఎంగా ఉన్న వేళ, ఆయనపై పడ్డ అవినీతి మరకలను కన్నడిగులు తమ ఓట్లతో తుడిచేశారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా రాష్ట్రమంతా పర్యటించి, ఓటర్లకు దగ్గర కావడంలో విజయం సాధించిన యడ్యూరప్ప, ఎల్లుండి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.
ఇక అక్రమంగా గనులను తవ్వి ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం తెచ్చాడన్న అభియోగాలపై నెలల తరబడి జైలులో ఉన్న గాలి జనార్దన్ రెడ్డిని సైతం కన్నడ ప్రజలు ఆదరించారు. ఆయన పట్టుబట్టి టికెట్లు ఇప్పించుకున్న తొమ్మిది మందిలో ఎనిమిది మంది విజయం దిశగా దూసుకెళుతున్నారు. ఈ ఎన్నికల ద్వారా బళ్లారి ప్రాంతంలో తమకున్న పట్టును గాలి సోదరులు నిలుపుకున్నట్టే.
ఇక రాబోయే బీజేపీ ప్రభుత్వంలో గాలి సోదరుడు సోమశేఖరెడ్డితో పాటు కనీసం మరొకరికి మంత్రివర్గంలో చాన్స్ ఉంటుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇక తాజా ట్రెండ్స్ విషయానికి వస్తే, ఒక సీటులో విజయం సాధించిన బీజేపీ 110 చోట్ల ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 68 చోట్ల, జేడీఎస్ 41 చోట్ల, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.