Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమికి కారణం నిర్లక్ష్యమేనట!
- ‘కాంగ్రెస్’పై వ్యతిరేకత ఉందన్న నివేదికలను పట్టించుకోని సిద్ధూ
- ఆకట్టుకోలేకపోయిన పథకాలు
- మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, దళితులు దూరమవడం
- సొంత కమ్యూనిటీని సిద్ధరామయ్య నిర్లక్ష్యం చేయడం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థానాలు దక్కకపోవడం, బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించడం తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఎన్నికలకు ముందు పలు నివేదికలు వెల్లడించాయని, అయితే సిద్ధరామయ్య పట్టించుకోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సిద్ధరామయ్య అమలు చేసిన పథకాలు ప్రజలను ఆకట్టుకోలేకపోవడం, ప్రభుత్వ పనితీరు ప్రభావవంతంగా లేకపోవడమని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, సిద్ధరామయ్యకు మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, దళితుల అండ దూరమవడంతో పాటు ఆయన సొంత కమ్యూనిటీ అయిన కురుబ కులస్తుల సహకారం లేకపోవడం కూడా కారణాలుగా చెబుతున్నారు. తనకు సహకారమందించిన కురుబ కులస్తులను సిద్ధరామయ్య నిర్లక్ష్యం చేయడంతో కాంగ్రెస్ పార్టీకి వారు దూరమైనట్టు అభిప్రాయపడ్డారు.
ఇక లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తించాలని సిద్ధరామయ్య వేసిన పథకం బెడిసికొట్టింది. లింగాయత్ లను మైనార్టీలుగా గుర్తించాలని చేసిన ప్రయత్నానికి ఆ వర్గం నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవడం, ప్రధాని మోదీ ఆకర్షణ, ఎన్నికల ప్రచారం కన్నడిగులపై ఎంతో ప్రభావితం చేయడం వంటి అంశాలు కాంగ్రెస్ ను ఓటమిపాలు చేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.