Karnataka: కర్ణాటకలో గవర్నర్ నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ!
- కర్ణాటకలో అధికార పీఠం కోసం బీజేపీ, కాంగ్రెస్-జేడీఎస్ పోటీ
- గవర్నర్ తీసుకోనున్న నిర్ణయం కోసం ఎదురుచూపులు
- ఇప్పటికే బెంగళూరు చేరుకున్న బీజేపీ అగ్రనేత అమిత్ షా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద రాజకీయపార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ చురుగ్గా పావులు కదుపుతున్నాయి. జేడీఎస్ కు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. అదే సమయంలో జేడీఎస్ లో చీలికతెచ్చి మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవాలని బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ ను ఇరుపార్టీల నేతలు కలిశారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే నిమిత్తం గవర్నర్ ఏ పార్టీని ఆహ్వానిస్తారనే విషయం, ఆయన తీసుకోనున్న నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, కర్ణాటకలో అధికార పీఠం దక్కించుకునేందుకు తమకే హక్కు ఉందని కాంగ్రెస్-జేడీఎస్ అంటున్నాయి. మరోపక్క, ఈ ఎన్నికల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన తమకే అవకాశం కల్పించాలని బీజేపీ నేత యడ్యూరప్ప అంటున్నారు.
ఇదిలా ఉండగా, నేడు సీఎల్పీ సమావేశం జరగనుంది. సీఎల్పీ తీర్మానాన్ని గవర్నర్ కు బీజేపీ నేతలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు.