Chandrababu: చెకింగ్ చేశారు.. లాంచీ నడిపేవారు చేసిన తప్పిదం వల్లే ప్రమాదం.. 22 మంది మృతి: చంద్రబాబు ప్రకటన
- లాంచీలో సిమెంటు బస్తాలు వేశారు
- మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం
- ఇద్దరు బాలురు సహా 12 మంది మృతదేహాలు వెలికితీత
- మరో 10 మృతదేహాలను వెలికితీయాల్సి ఉంది
గోదావరిలో లాంచీ మునక ప్రమాదంలో 22 మంది మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వాడపల్లిలో జరుగుతోన్న సహాయక చర్యలను చంద్రబాబు నాయుడు పలువురు మంత్రులతో కలిసి పర్యవేక్షించి మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని, తక్షణ సాయం కింద లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు.
ఇప్పటివరకు ఇద్దరు బాలురు సహా 12 మంది మృతదేహాలు వెలికితీశారని, మరో 10 మృతదేహాలను వెలికి తీయాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని, ఈ ఘటనలో మరో ముగ్గురి ఆచూకీ, వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులను చూస్తే బాధేస్తోందని అన్నారు.
నిన్న ఉదయం లాంచీని చెకింగ్ కూడా చేశారని, కానీ సాయంత్రం బోటు నడిపిన వారు సిమెంటు బస్తాలు తీసుకొచ్చారని, అందుకే ప్రమాదం జరిగిందని చంద్రబాబు తెలిపారు. లాంచీలో ఎన్ని సిమెంటు బస్తాలు వేశారో విచారణ చేస్తున్నామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. లాంచీపై నున్న వారు కొందరు దూకేసి తప్పించుకోగలిగారని చెప్పారు.