Rahul Gandhi: దేశంలో పరిస్థితి పాకిస్తాన్ మాదిరిగా తయారైంది: రాహుల్ గాంధీ ఘాటు ఆరోపణలు
- బీజేపీ సుప్రీంకోర్టు జడ్జిలను సైతం భయపెడుతోంది
- రాజ్యాంగంపైనే దాడి
- నియంతృత్వంలోనే ఇలాంటివి జరుగుతాయి
- దేశంలో భయం, అభద్రత భావం ప్రబలంగా ఉన్నాయి
బీజేపీపై రాహుల్ గాంధీ తన మాటల దాడిని తీవ్రతరం చేశారు. దేశంలో ఉన్న పరిస్థితులు పాకిస్తాన్ లో మాదిరిగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఈ రోజు రెండోసారి ఛత్తీస్ గఢ్ లోని రాయిపూర్ వేదికగా స్పందించారు.
"బీజేపీ సుప్రీంకోర్టు జడ్డీలను కూాడా భయపెడుతోంది. ఇలాంటిది నియంతృత్వంలోనే జరుగుతుంది. భయం, అభద్రతతో కూడిన వాతావరణం దేశంలో ప్రబలంగా ఉంది. దేశంలో అన్ని వ్యవస్థలను ఆర్ఎస్ఎస్ ఆ విధంగా మార్చేస్తోంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగంపైనే దాడి జరుగుతోందని ఆరోపించారు. కర్ణాటకలో ఒకవైపు ఎమ్మెల్యేలంతా నిలబడి ఉంటే, మరోవైపు గవర్నర్ ఉన్నారని (వ్యతిరేకంగా) పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందన్న జేడీఎస్ ఆరోపణలను రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.