Gambhir: సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్ చేస్తుంటే స్టేడియంలో వెయ్యిమందేనా?: బీసీసీఐపై గంభీర్ ఫైర్
- ఐపీఎల్‌పై పెట్టిన శ్రద్ధ టెస్టుల మీద పెట్టడం లేదు
- వన్డేలు, టీ20లను మాత్రం బాగా ప్రమోట్ చేసుకుంటోంది
- పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గంభీర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ విరుచుకుపడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మార్కెట్ చేసుకునేందుకు చేయాల్సినదంతా చేస్తున్న బీసీసీఐ టెస్టుల విషయంలో మాత్రం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదన్నాడు.
‘‘వన్డేలు, టీ20ల మార్కెట్ కోసం తాపత్రయపడుతున్నంతగా టెస్ట్ క్రికెట్‌ను మార్కెట్ చేసేందుకు బీసీసీఐ ఆసక్తి చూపడం లేదని అనిపిస్తోంది. 2011లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో విండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచే ఇందుకు ఉదాహరణ. ఆ మ్యాచ్‌లో తొలిరోజు భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టేడియంలో ఉన్నది వెయ్యిమందే’’ అని గంభీర్ పేర్కొన్నాడు.
‘‘వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి ఆటగాళ్లు ఆడుతున్న మ్యాచ్‌ను వెయ్యి మంది మాత్రమే చూస్తున్నారంటే ఎలా ఉంటుందో ఊహించండి’’ అని పేర్కొన్నాడు. క్రికెట్ చరిత్రకారుడు బొరియా మజుందార్ రాసిన ‘ఎలెవన్ గాడ్స్ అండ్ బిలియన్ ఇండియన్స్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న గంభీర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.