Tirumala: మరింత బాధ్యతగా స్వామి వారి కైంకర్యాలు నిర్వహిస్తా: టీటీడీ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు
- 65 సంవత్సరాలు పైబడిన అర్చకుల పదవీ విరమణ మంచిదే
- రమణదీక్షితుల పర్యవేక్షణలోనే కైంకర్యాలు నిర్వహిస్తున్నాం
- ఇన్నాళ్లూ ఎలా జరిగాయో ఇప్పుడూ అలానే జరుగుతున్నాయి
అరవై ఐదు సంవత్సరాలు పైబడిన అర్చకులకు పదవీ విరమణను అమలు చేస్తూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం మంచి పరిణామమేనని టీటీడీ కొత్త ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంకా బాధ్యతగా స్వామి వారి కైంకర్యాలు చేసుకునేందుకు తనకు అవకాశం లభించిందని చెప్పారు.
‘స్వామి వారికి పూజా కైంకర్యాల వ్యవహారం చాలా ఏళ్లుగా రమణదీక్షితుల పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. ఆయన సూచనల మేరకే మేము పనిచేస్తున్నాం. విధుల కేటాయింపు ఆయనే చేస్తున్నారు. సంబంధిత కార్యక్రమాలన్నీ నిర్విరామంగా జరుగుతున్నాయి. స్వామి వారి పూజలు, కైంకర్యాలు ఇన్నాళ్లూ ఎలా జరిగాయో ఇప్పుడూ అలానే జరుగుతున్నాయి !’ అని అన్నారు.