vajubhai: గవర్నర్ వాజుభాయ్ కేంద్రానికి ఓ బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారు: సీపీఐ నారాయణ
- ప్రభుత్వం ఏర్పాటుకు మెజార్టీ లేని బీజేపీని అనుమతిస్తారా?
- వాజ్ భాయ్ వాలా కళ్లున్న కబోది
- 2019 ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసి పనిచేస్తాయి
- జనసేన పార్టీ వస్తే మాతో కలుపుకుంటాం
కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలాపై సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీకి మెజార్టీ లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతిచ్చిన వాజుభాయ్ వాలా కళ్లున్న కబోది అని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ లకే పూర్తి మెజార్టీ అని, మెజార్టీ సాధించలేకపోయిన బీజేపీకి అవకాశం ఇచ్చి గవర్నర్ కుట్ర పూరితంగా వ్యవహరించారని ఆరోపించారు.
పదిహేను రోజుల గడువు కావాలని బీజేపీ కోరింది తమ బలం నిరూపించుకునేందుకు కాదని, ఎమ్మెల్యేలతో బేరసారాల కోసమని విమర్శించారు. కేంద్రానికి వాజుభాయ్ ఓ బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారని, మోసపూరిత విధానాలతో బీజేపీ గవర్నర్ల ద్వారా పాలన చేస్తోందని, అసలు, గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ కి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ‘హోదా’పై బీజేపీ వైఖరిని అమెరికాలో ఎన్ఆర్ఐలు వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల గురించి మాట్లాడుతూ, సీపీఐ, సీపీఎం కలిసి పనిచేస్తాయని, జనసేన పార్టీ వస్తే తమతో కలుపుకుంటామని చెప్పిన నారాయణ, జగన్ తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు.