Karnataka: కర్ణాటక రాజకీయాలపై వాట్సాప్ జోక్ వినిపించిన సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ సిక్రి!
- కాంగ్రెస్ వేసిన పిటిషన్ విచారణ సమయంలో జోక్ చెప్పిన సిక్రి
- రిసార్ట్ రాజకీయాలను ఉద్దేశించి పేలిన జోక్
- కోర్టు ప్రాంగణంలో నవ్వులు
కర్ణాటక రాజకీయాల్లో చోటుచేసుకుంటున్నపరిణామాల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా ఎన్నో జోక్స్ పేలుతున్నాయి. ఇదే నేపథ్యంలో సుప్రీంకోర్టు వేదికగా కూడా ఓ జోక్ పేలింది. ఆ జోక్ ను సాక్షాత్తు జస్టిస్ ఏకే సిక్రి చెప్పడం గమనార్హం. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్ ను జస్టిస్ సిక్రి ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈరోజు విచారించింది.
ఈ విచారణకు సంబంధించి ఇరువర్గాల వాదనలు ఊపందుకున్నాయి. తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ‘మాకు ఇప్పుడే ఓ వాట్సాప్ సందేశం వచ్చింది’ అంటూ సిక్రి ఓ వాట్సాప్ జోక్ వినిపించారు. ‘మా దగ్గర 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నన్ను సీఎం చేయండి అంటూ హోటల్ యజమాని గవర్నర్ కి సందేశం పంపించాడట’ అని సిక్రీ చెప్పడంతో కోర్టు ప్రాంగణం నవ్వులతో నిండిపోయింది.
కాగా, కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ రేపు బలపరీక్ష నిరూపించుకోవాల్సిందిగా జస్టిస్ సిక్రిస్ ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ లు తమ ఎమ్మెల్యేలు జారి పోకుండా రిసార్ట్స్ కు, స్టార్ హోటళ్లకు తిప్పుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిక్రి చెప్పిన వాట్సాప్ జోక్ కడుపుబ్బ నవ్వించింది.