Karnataka: లింగాయత్ వర్గపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్-జేడీఎస్ లకు హ్యాండిస్తారా?

  • కాంగ్రెస్- జేడీఎస్ లలోని ‘లింగాయత్’ ఎమ్మెల్యేలపై బీజేపీ దృష్టి
  • కాంగ్రెస్ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆ వర్గపు ఎమ్మెల్యేలు
  • వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు కమల నాథుల యత్నాలు!

కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ బలపరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ బలపరీక్షలో బీజేపీ నెగ్గుతుందా? లేదా? అనే విషయమై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సంయుక్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చూస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా ఎమ్మెల్యేలు తమకు ఉన్నారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో, తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు చూసుకుంటున్నాయి.

అయితే, ఇంతగా జాగ్రత్తపడుతున్నప్పటికీ ఇరు పార్టీలలో ఉన్న లింగాయత్ వర్గపు ఎమ్మెల్యేల విషయమై అనుమానాలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం జరిగే బలపరీక్షలో లింగాయత్ వర్గపు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతుగా ఓటేస్తారేమో అనే అనుమానాలను ఇరుపార్టీలకు చెందిన నేతలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో 18 మంది, జేడీఎస్ లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ వర్గానికి చెందిన వారు ఉన్నారు. గతంలో తమ వర్గాన్ని విడదీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించడం, లింగాయత్ లకు వ్యతిరేకంగా భావిస్తున్న జేడీఎస్ పార్టీతో కాంగ్రెస్ జతకట్టడం వంటి అంశాలతో ఆ వర్గపు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు బీజేపీ వర్గాల సమాచారం.

ఈ అవకాశాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మలచుకునేందుకు చూస్తోందని, లింగాయత్ వర్గపు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని బలపరీక్షలో నెగ్గాలని బీజేపీ చూస్తున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 20 మంది లింగాయత్ వర్గపు ఎమ్మెల్యేలపైనే అందరి దృష్టి ఉంది.

  • Loading...

More Telugu News