Chandrababu: సోమవారమే ప్రమాణ స్వీకారం.. చంద్రబాబు, కేసీఆర్‌లను కూడా ఆహ్వానించాను: కుమారస్వామి
- మంత్రివర్గ కూర్పుపై రేపు కాంగ్రెస్ నేతలతో చర్చ
- కంఠీరవ మైదానంలో ప్రమాణ స్వీకారం
- 15 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ అన్నారు
- మాకు 15 రోజుల సమయం అవసరం లేదు
కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు బీజేపీ నేత యడ్యూరప్ప తమ రాష్ట్ర గవర్నర్ వాజుభాయి వాలాకి రాజీనామా లేఖ అందించారు. అనంతరం వాజుభాయి వాలాని జేడీఎస్ నేత కుమారస్వామి కలిసి, తమకు కాంగ్రెస్ శాసన సభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గవర్నర్ తమని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని, బెంగళూరు కంఠీరవ మైదానంలో సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు.
గవర్నర్ వాజుభాయి వాలా తనతో 15 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని అన్నారని,
తమకు 15 రోజుల సమయం అవసరం లేదని, సాధ్యమైనంత త్వరలోనే శాసనసభను సమావేశపరుస్తామని కుమారస్వామి వ్యాఖ్యానించారు. మంత్రివర్గ కూర్పుపై రేపు కాంగ్రెస్ నేతలతో చర్చిస్తామని కుమారస్వామి అన్నారు. తన ప్రమాణ స్వీకారానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు.