TTD: చట్టాలు, సంప్రదాయాలకు అతీతుడు అర్చకుడు: రమణ దీక్షితులు
- లక్షల జన్మల పుణ్యఫలంతో అర్చకుడు పుడతాడు
- స్వామివారికి శాస్త్రోక్త పూజలు జరగడం లేదు
- దేశానికి అరిష్టమని చెప్పిన రమణ దీక్షితులు
ఎవరు తనకు సేవ చేయాలన్న విషయమై దేవదేవుడే నిర్ణయం తీసుకుంటాడని, బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే వైష్ణవత్వం సిద్ధిస్తుందని, స్వామివారి అర్చకులు మానవ నిర్మితాలైన చట్టాలు, సంప్రదాయాలకు అతీతులని, కావాలని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్చకులను స్వామి నుంచి దూరం చేయడం తగదని టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు.
ఏడుకొండలపై అర్చకుల రిటైర్ మెంట్ పై వాడివేడిగా చర్చ సాగుతున్న వేళ, ఈ ఉదయం అనిల్ కుమార్ సింఘాల్ మీడియా సమావేశం పెట్టి, వివరణ ఇవ్వగానే, రమణ దీక్షితులు మీడియా ముందుకు వచ్చారు. స్వామి ఆజ్ఞతో జన్మించే అర్చకుడు, స్వామిని అర్చించి, ఆపై పరమపదించి తిరిగి స్వామిని చేరుకుంటారని చెప్పిన ఆయన, ప్రత్యక్ష దైవమైన స్వామి పలకరిస్తే పలుకుతాడని, ప్రశ్నిస్తే సమాధానం చెబుతాడని, చెప్పకపోయినా కోరికలు తెలుసుకుని తీర్చి వెన్నంటి నిలుస్తాడని చెప్పారు.
ఎన్నో లక్షల జన్మల పుణ్యఫలం వల్లే తిరుమల శ్రీవెంకటేశ్వరుని అర్చించుకునే అవకాశం లభిస్తుందని చెప్పిన రమణ దీక్షితులు, వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారికి జరగాల్సిన పూజా విధానంపై స్పష్టమైన ఆదేశాలున్నాయని చెప్పారు. ఇప్పుడు తిరుమలలో ఆ మంత్ర ప్రకారం, క్రియలు సాగడం లేదని ఆరోపించారు. స్వామికి జరిపే ఉపచారాలు, త్రికాల పూజల గురించి శాస్త్రంలో ఉందని అన్నారు. ఈ పూజల లక్ష్యం లోక కల్యాణమేనని, పూజలు సరిగ్గా జరగకుంటే వర్షాలు సకాలంలో కురవవని, దేశానికి అరిష్టమని చెప్పారు.