r.narayanamurthy: అన్నం తినే ప్రతిఒక్కరూ రైతు గురించి తెలుసుకోవాలి: నటుడు ఆర్. నారాయణమూర్తి
- రైతు గొప్పతనం అర్థం చేసుకోవాలి
- రైతును పూజించాలి, గౌరవించాలని చెప్పేదే ‘అన్నదాతా..’
- ఈ సినిమాను ఆదరిస్తున్నందుకు నాకు తృప్తిగా ఉంది
అన్నం తినే ప్రతిఒక్కరూ రైతు గురించి తెలుసుకోవాలని, ఆ రైతు గొప్పతనం అర్థం చేసుకోవాలని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఇటీవల విడుదలైన ‘అన్నదాతా సుఖీభవ’ చిత్రంలో నటించిన ఆర్.నారాయణమూర్తి ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రైతును పూజించాలి, గౌరవించాలని చెప్పేదే ఈ సినిమా అని, ప్రజలందరూ ఆదరిస్తున్నారని, ఒక కళాకారుడిగా తనకు చాలా తృప్తిగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ‘మన దేశంలో ఉన్న రైతు సవతి బిడ్డ అయిపోతున్నాడు. బ్యాంకుల్లో అప్పు చేసి తీర్చలేకపోతే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచడం లేదు..చాటింపు వేసి రైతు పరువు తీస్తున్నారు. ఆత్మాభిమానం గల రైతు ఇది భరించలేకపోతున్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇలా చేసుకోకూడదు.. బతుకుపోరు చేయాలి. అదే సమయంలో రైతు కోసం ఓ రిజర్వ్ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి’ అని చెప్పుకొచ్చారు.