chatisgarh: దంతెవాడలో పేలిన మందుపాతర..ఏడుగురు జవాన్ల మృతి
- చల్నార్ గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తుండగా దారుణం
- జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం పేల్చివేత
- రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్
ఛత్తీస్ గఢ్ లో ఇటీవల జరిగిన వరుస ఘటనల్లో తమ సభ్యులను కోల్పోయిన మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకున్నారు. మరోసారి రెచ్చిపోయారు. మందుపాతర పెట్టి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చి వేశారు. దంతెవాడ జిల్లాలోని చల్నార్ గ్రామంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
మావోయిస్టులు మందుపాతర పేల్చిన ప్రాంతంలో పెద్దగొయ్యి ఏర్పడింది. పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం తునాతునకలైంది. ఈ సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్ చేపట్టాయి. కాగా, ఈ సంఘటనపై ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ స్పందించారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ మావోయిస్టులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు. ఇదిలా ఉండగా, రేపు జరగనున్న పాసింగ్ అవుట్ పరేడ్ కు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్న తరుణంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
సీఆర్పీఎఫ్ సరికొత్త వ్యూహం!
ఛత్తీస్ గఢ్ లోని మావోయిస్టులను మట్టుబెట్టేందుకు సీఆర్పీఎఫ్ తొలిసారి సరికొత్త బెటాలియన్ ని రూపొందించినట్టు తెలుస్తోంది.మావోయిస్టులపై పోరాడే నిమిత్తం స్థానికులతో సమన్వయం సాధించేందుకు సరికొత్త బెటాలియన్ ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ బెటాలియన్ కు 241 నంబర్ నే కేటాయించిందని, దీనికి ‘బస్తారియా బెటాలియన్’ అని పేరు పెట్టారని సమాచారం. ఈ బెటాలియన్ లో మొత్తం 743 మంది ఆదివాసి యువత ఉంటుంది. ఈ బెటాలియన్ లో మొత్తం 198 మంది మహిళలు ఉంటారు. వీరంతా బీజాపూర్, దంతెవాడ, నారాయణ్ పూర్, సుకుమా ప్రాంతాలకు చెందినవారు.