BSF: భారత్ ‘దెబ్బ’కు పాక్ మైండ్ బ్లాంక్.. కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరం!

  • కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు
  • బీఎస్ఎఫ్ ప్రతీకార దాడులతో దాయాది బెంబేలు
  • పాక్ బుద్ధి మారకుంటే ఈసారి భారీ మూల్యం తప్పదని హెచ్చరిక

భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చినట్టు ఉంది. సైన్యం దెబ్బకు విలవిల్లాడిన దాయాది కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరానికి వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని అలవాటుగా మార్చుకున్న పాక్ శుక్రవారం కూడా తన అలవాటైన పనిని కొనసాగించింది. అయితే, ఇన్నాళ్లూ సహనం వహించిన భారత్..శుక్రవారం దీటుగా బదులిచ్చింది.

భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పాక్ బంకర్లపై రాకెట్ల వర్షం కురిపించింది. భారత్ నుంచి ఆ స్థాయిలో ప్రతీకార చర్య ఉంటుందని ఊహించని పాక్ బెంబేలెత్తిపోయింది. కళ్ల ముందు భారీ నష్టం కనిపిస్తుండడంతో వణికిపోయింది. మరింత నష్టం జరగకముందే భారత్‌ను ఆపాలని నిర్ణయించుకున్న పాక్ రేంజర్లు బీఎస్ఎఫ్ వద్దకు కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరానికి వచ్చారు. దీంతో మన్నించిన భారత్ కాల్పులు ఆపింది.

దాడులకు సంబంధించిన 19 సెకన్ల నిడివి ఉన్న వీడియోను బీఎస్ఎఫ్ ఆదివారం విడుదల చేసింది. పాక్ బంకర్ వైపు దూసుకెళ్లిన రాకెట్ వారి స్థావరాలను ధ్వంసం చేస్తుండడం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. పాక్ కాళ్ల బేరానికి వచ్చిన విషయాన్ని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. పాక్ బుద్ధి మారుతుందని చాలా ఏళ్లుగా ఓపికగా ఎదురుచూశామని, కానీ ఫలితం లేకపోవడంతో ప్రతీకార దాడులు తప్పలేదని స్పష్టం చేశారు. ఇది శాంపిల్ మాత్రమేనని, పాక్ మళ్లీ ఇలాగే వ్యవహరిస్తే ఈసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News