TTD: అసలు కృష్ణదేవరాయల నగలంటూ ఏమీ లేవు: రమణదీక్షితులుపై విరుచుకుపడ్డ ప్రధానార్చకులు
- రాయలు ఆభరణాలు ఇచ్చినట్టు ఎక్కడా రికార్డు లేదు
- రమణ దీక్షితులు చేస్తున్నది తప్పుడు ప్రచారమే
- ఉనికిని కాపాడుకునేందుకు సీఎం చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
- తీవ్ర ఆరోపణలు చేసిన వేణుగోపాల దీక్షితులు
విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న కాలంలో, ఎనిమిది సార్లు తిరుమలకు వచ్చి స్వామివారికి అపారమైన కానుకలను సమర్పించినట్టుగా చరిత్ర చెబుతుండగా, అసలు తిరుమల బొక్కసం (ఖజానా)లో కృష్ణదేవరాయలు సమర్పించిన నగలంటూ, ప్రత్యేకంగా ఏమీ లేవని, ఈ విషయంలో రమణ దీక్షితులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు ఆరోపించారు. ఆయన తన ఉనికిని కాపాడుకునేందుకే సీఎం చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. వెయ్యికాళ్ల మండపం కూల్చివేత వెనుక రమణ దీక్షితులు కూడా ఉన్నారని, ఆయన అంగీకారంతోనే మండపాన్ని కూల్చివేశారని గుర్తు చేసిన వేణుగోపాల దీక్షితులు, ఆలయంతో ఎటువంటి సంబంధమూ లేని కట్టడం అదని చెప్పారు.
విధులకు సరిగ్గా హాజరుకాని ఆయన కుమారులకు నోటీసులు ఇచ్చిన తరువాతనే రమణ దీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారని, గతంలో తనను సూర్యప్రభ వాహనం నుంచి బలవంతంగా నెట్టేసిన ఘనత ఆయనదని అన్నారు. బ్రాహ్మణ సంఘాల పేరిట విమర్శిస్తున్న సౌందరరాజన్, పెద్దింటి రాంబాబు, ఆత్రేయబాబులకు టీటీడీతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. తిరుమలలో ఉన్నది స్వామి కాదని, అమ్మవారని ఆయన చెబుతుంటే, తామంతా తలూపాలా? అని ప్రశ్నించారు. పాతికేళ్లుగా ఆలయ పరిధిలో ఏం జరిగినా అది రమణ దీక్షితులుకు తెలిసే జరిగిందని, ఇప్పుడు తప్పులు ఎత్తి చూపుతున్నారంటే, అది ఆయన చేసిన తప్పేనని వేణుగోపాల దీక్షితులు అన్నారు.