Madhu Yaskhi: బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ త్యాగం చేయాల్సి ఉంది: మధు యాష్కీ
- కర్ణాటకలో సీఎం పదవిని కాంగ్రెస్ ఆశించదు
- సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యం
- ప్రభుత్వం సజావుగా నడిచేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నాం
సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీనే ఆఫర్ చేసిందని... ఈ నేపథ్యంలో, సీఎం పదవిని కాంగ్రెస్ పార్టీ అడిగే ఆలోచనే ఉండదని ఏఐసీసీ కార్యదర్శి, కర్ణాటక కాంగ్రెస్ సహాయ ఇన్ ఛార్జి మధు యాష్కి తెలిపారు. రెండున్నరేళ్ల పాటు కాంగ్రెస్ అభ్యర్థికి సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ ను తాము చేయబోమని అన్నారు. ఐదేళ్ల పాటు కొనసాగేలా సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం సజావుగా నడిచేందుకు సమన్వయ కమిటీని నియమించనున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీని నిలువరించాలంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని త్యాగాలు చేయకతప్పదని చెప్పారు. బీజేపీని అడ్డుకోవడమే కాంగ్రెస్ ప్రథమ లక్ష్యమని అన్నారు.