ironleg shasthri: ఆ రోజు మా నాన్నను అలా చూసి అమ్మ కుప్పకూలిపోయింది: 'ఐరన్ లెగ్ శాస్త్రి' కుమారుడు
- నాన్నకు గుండెపోటు వచ్చింది
- అమ్మ .. నేను వెంటనే బయల్దేరాం
- అప్పటికే ఆయన చనిపోయారు
తెలుగు తెరపై ఐరన్ లెగ్ శాస్త్రి పండించిన హాస్యాన్ని అంత తేలికగా మరిచిపోలేం. 'ఐరెన్ లెగ్ ' అని ఒక సినిమాలో అనిపించుకున్న ఆయనకి ఆ తరువాత అదే ఇంటిపేరు అయింది. ఏ భారీకాయంతో ఆయన హాస్యాన్ని అందించాడో .. ఆ భారీ కాయమే ఆయనను అనారోగ్యానికి గురిచేసింది. ఆ అనారోగ్యమే ఆయనను అవకాశాల నుంచి దూరం చేసింది.
అలాంటి ఐరన్ లెగ్ శాస్త్రి తనయుడు ప్రసాద్ 'జంబ లకిడి పంబ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "అవకాశాలు తగ్గడంతో మా నాన్న మా సొంత ఊరైన తాడేపల్లిగూడెం వెళ్లి అక్కడే ఉండేవారు. నేను .. అమ్మ హైదరాబాద్ లోనే ఉండేవాళ్లం. నాన్నకి గుండెపోటు వచ్చిందని తెలిసి ఆ రాత్రే అమ్మ .. నేను కలిసి ట్రైన్ ఎక్కేశాము. మేము ట్రైన్ దిగి హాస్పిటల్ కి వెళుతున్నాం .. ఎదురుగా రిక్షాలో నాన్న మృతదేహం. ఆయన నడుము భాగం మాత్రమే రిక్షాలో వుంది .. తల .. కాళ్లు చేతులు రిక్షాలో నుంచి బయటికి వేళ్లాడుతున్నాయి. ఆ దృశ్యం చూసి అమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది" అంటూ ఆనాటి సంఘటనను తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.