Karnataka: కన్నడనాట కూటమిలో కలకలం... రాజీనామా చేస్తామని పలువురి బెదిరింపులు!
- ఇంకా ఏర్పాటుకాని జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం
- పదవుల కోసం ఎమ్మెల్యేల ఆందోళన
- బెదిరింపులకు దిగిన యశ్వంత్ రాయ్, శివానంద పాటిల్
- సర్దిచెప్పేందుకు సిద్ధరామయ్య ప్రయత్నాలు
కన్నడనాట ఇంకా జేడీఎస్ - కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండానే మంత్రి పదవుల కోసం కొట్లాట మొదలైంది. తమకు మంత్రి పదవులు ఇవ్వకుంటే రాజీనామాలు చేస్తామని కొందరు ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగుతుండటం కాంగ్రెస్ శిబిరంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని, వాటిల్లో ఒకటి దళితులకు, మరొకటి లింగాయత్ వర్గానికి ఇవ్వాలని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో దేవెగౌడ మాత్రం అంత సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.
ఇక తమను మంత్రులుగా చేయకుంటే, రాజీనామా చేయడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యశ్వంత్ రాయ్ పాటిల్, శివానంద పాటిల్ హెచ్చరించారు. ప్రస్తుతం బెంగళూరు హిల్టన్ హోటల్ లో ఉన్న వారు తమ ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ, ఎంబీ పాటిల్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా, తమకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని వారు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వారు సిద్ధరామయ్య వద్ద స్పష్టం చేయగా, ప్రమాణ స్వీకారం కూడా జరుగకుండా ఈ తరహా మొండి పట్టుదల వద్దని ఆయన సర్దిచెప్పారని సమాచారం. బల నిరూపణ తరువాత అన్ని అంశాలనూ చర్చిద్దామని ఆయన వారిని సముదాయించినట్టు తెలుస్తోంది.