china: మసీదులపై జాతీయ జెండా ఎగరాల్సిందే.. ఇస్లాం మతంపై పలు ఆంక్షలను విధించిన చైనా
- జాతీయ జెండాలను ఎగురవేస్తే.. దేశ భక్తి పెరుగుతుంది
- కేవలం ఐదు ప్రాంతాల్లో మాత్రమే మత ప్రచారాలను నిర్వహించాలి
- ప్రకటన జారీ చేసిన చైనా ప్రభుత్వం
దేశంలో ఇస్లాం మతం, ఇస్లాం భావజాలం వ్యాప్తి చెందకుండా చైనా ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. మసీదులు, మత ప్రచారాలపై ఆంక్షలను విధించింది. దేశంలోని ముస్లింలంతా దేశ భక్తిని చాటుకోవాలని, తప్పనిసరిగా మసీదులపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఆదేశించింది. నింగ్సియా, బీజింగ్, జిన్ జియాంగ్, క్వింఘై, గాన్సూ అనే ఐదు ప్రాంతాల్లో మాత్రమే మత ప్రచారాలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
గత వారం రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఈ మేరకు ఆంక్షలు విధించింది. ప్రభుత్వానికి చెందిన చైనా ఇస్లామిక్ అసోసియేషన్ పేరిట ఈ మేరకు ప్రకటన జారీ అయింది. మసీదులపై జాతీయ జెండాలను ఎగురవేయడం ద్వారా ముస్లింలలో దేశభక్తి పెరుగుతుందని ఇస్లామిక్ అసోసియేషన్ తన ప్రకటనలో తెలిపింది. మరోవైపు, దేశంలో ఇస్లాం మత వ్యాప్తిని అడ్డుకునేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమించిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.