Pawan Kalyan: రమణ దీక్షితులుకు మద్దతుగా మాట్లాడిన పవన్ కల్యాణ్!
- పాతికేళ్లు సేవలు చేసిన వ్యక్తి నోటి నుంచి ఆరోపణలు
- నిజానిజాలు తేల్చాల్సిన ప్రభుత్వం ఆ పని చేయట్లేదు
- జనవేన అధినేత పవన్ కల్యాణ్
దాదాపు 25 సంవత్సరాలకు పైగా శ్రీవెంకటేశ్వరునికి సేవలందిస్తున్న వ్యక్తి, అధికారుల వైఖరి, చేస్తున్న తప్పులపై ఆరోపణలు చేస్తుంటే, వాటిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. గతంలో ఎన్నోసార్లు రమణ దీక్షితులతో ఆశీర్వచనాలు పొందిన చంద్రబాబు, ఇప్పుడాయన్ను రాజకీయ కారణాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, తనకు మద్దతిస్తున్న వారి ప్రయోజనాలను కాపాడేందుకు బలి చేశారని అనిపిస్తోందని ఆయన అన్నారు.
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్, ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు. తిరుమలలో టీటీడీ చేస్తున్న అక్రమాలపై భక్తుల్లోనూ అనుమానాలు నెలకొని వున్నాయని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని అన్నారు. టీటీడీపై వస్తున్న ఆరోపణలపై నిజానిజాలను నిగ్గు తేల్చాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.