Tamilnadu: రణరంగంగా తమిళనాడులోని తూత్తకుడి.. పోలీస్ కాల్పుల్లో తొమ్మిది మంది మృతి!
- స్టెరిలైట్ రాగి కర్మాగారాన్నివిస్తరించొద్దంటూ ప్రజల ఆందోళన
- కలెక్టరేట్ ను ముట్టడించేందుకు నిరసనకారుల విఫలయత్నం
- పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
తమిళనాడు రాష్ట్రంలోని తూత్తకుడి రణరంగంగా మారింది. అక్కడి స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని విస్తరించాలని జరుగుతున్న యత్నాలను నిరసిస్తూ ప్రజలు చేపట్టిన ఆందోళనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులు జిల్లా కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. అయితే, పట్టణంలో 144 సెక్షన్ విధించినప్పటికీ స్థానిక చర్చి వద్ద గుమిగూడిన నిరసనకారులు తొలుత కర్మాగారం వైపు వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్ ను ముట్టడించేందుకు నిరసనకారులు యత్నించారు.
ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు, పలు వాహనాలకు నిప్పంటించారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించిన అనంతరం లాఠీఛార్జి చేశారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందారు.
ఈ సంఘటన నేపథ్యంలో అదనపు పోలీస్ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి జయకుమార్ మాట్లాడుతూ, తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని అన్నారు. కాగా, 1996లో స్టెరిలైజ్ పరిశ్రమను ఇక్కడ ప్రారంభించారు. అప్పటి నుంచి తరచుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ‘స్టెరిలైజ్’ కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, ప్రజలకు శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయని తూత్తకుడి వాసులు వాపోతున్నారు.
రేపు తూత్తకుడి జిల్లా బంద్
ఈ సంఘటన నేపథ్యంలో రేపు తూత్తకుడి జిల్లా బంద్ కు వాణిజ్య సంస్థలు పిలుపునిచ్చాయి. ఆందోళనకారులపై పోలీసుల దాడిని ఖండించిన వాణిజ్య సంస్థలు ఈమేరకు నిర్ణయం తీసుకున్నాయి.
బెంగళూరు పర్యటన వాయిదా వేసుకున్న స్టాలిన్
ఈ సంఘటనపై తమిళనాడు ప్రతిపక్ష, విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. తమిళనాడులో అల్లర్ల నేపథ్యంలో, కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరు కావలసిన డీఎంకే అగ్రనేత స్టాలిన్ తన బెంగళూరు పర్యటనను వాయిదా వేసుకున్నట్టు సమాచారం. రేపు తూత్తకుడి బాధితులను ఆయన పరామర్శించనున్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, డీజీపీ రాజేంద్రన్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మక్కళ్ నీది మయ్యం అధినేత కమలహాసన్ ఈ సంఘటనను ఖండించారు.