amaravati: రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు: చంద్రబాబు
- ఎందుకు అన్యాయం చేస్తున్నారని మోదీని నిలదీస్తున్నా
- రాజధానికి రూ.1500 కోట్లు మాత్రమే వచ్చింది
- రెవెన్యూ లోటు కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు
- ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా ప్రధాని మోదీ ఇంటి వద్ద కూడా టీడీపీ ఎంపీలు నిరసన తెలిపారని, వైసీపీ మాత్రం లాలూచీ రాజకీయాలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ధర్మ పోరాట బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఐదో బడ్జెట్లో మనల్ని మోసం చేశారని, మరోవైపు వైసీపీ పార్లమెంటు లోపల ప్రధాని మోదీకి విశ్వాసం పలికి, బయటకు వచ్చి మాత్రం అవిశ్వాసం అందని పేర్కొన్నారు.
ఏపీకి ఎందుకు అన్యాయం చేస్తున్నారని మోదీని అడుగుతున్నానని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని ప్రధాని మోదీని అడుగుతున్నానని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే 2019 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుని చిన్న చూపు చూస్తున్నారని, ఆ ప్రాజెక్టుకి రూ.54 వేల కోట్లు ఖర్చవుతుందని, ఇప్పటికి 54 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.
పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని, ఇకపై వంశధార నుంచి పెన్నా వరకు నదులను అనుసంధానం చేస్తామని చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకరించడం లేదని, కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చిందని, రెవెన్యూ లోటు కింద మనకు కేవలం రూ.4వేల కోట్లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు.