Hyderabad: హైదరాబాద్‌లో ఆస్తమా రోగులు బయటకు రావొద్దు: హెచ్చరిస్తున్న నిపుణులు
- భాగ్యనగరంలో డేంజర్ గాలి
- నాణ్యత ప్రమాణాలను దాటేసి ప్రమాదకరస్థాయికి
- శ్వాసకోశ, గుండెజబ్బులున్న వారికి హెచ్చరిక
హైదరాబాద్‌లో ఆస్తమాతో బాధపడేవారు బయటకు రాకపోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని గాలి నాణ్యత ప్రమాదకర స్థితికి చేరుకుందని, కాబట్టి అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు. మంగళవారం నగరంలో గాలి నాణ్యత సూచిక 102 మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్‌గా నమోదైంది. నిజానికి ఇది నిర్ణీత ప్రమాణానికి రెట్టింపు ఉంది. వాస్తవానికి గాలి నాణ్యత సూచిక నిర్ణీత ప్రమాణం 50 మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్‌గా ఉండాలి. దానిని ఎప్పుడో దాటేసి ప్రమాదకర స్థితికి చేరుకోవడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి కనుక గాలి నాణ్యత కోల్పోతే దానిని తిరిగి మెరుగు పరచడం చాలా కష్టమని చెబుతున్నారు.
ఈ విషయంలో అధికారుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాలి నాణ్యతను నమోదు చేసి వదిలేయడం తప్ప, నాణ్యత ప్రమాణాలు పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. గాలిలోని నలుసు పదార్థాల తీవ్రత పెరిగినప్పుడు దానిని పీలిస్తే నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతాయని, దీంతో ఆస్తమా ఉన్న వారి పరిస్థితి విషమంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భాగ్యనగరంలోని గాలిలో నలుసు పదార్థాలు ఎక్కువ స్థాయిలో నమోదు అవుతుండడంతో ప్రజలు ముఖ్యంగా ఆస్తమా రోగులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడేవారు ఈ గాలిని పీల్చడం ద్వారా మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అలాగే గుండె సంబంధ వ్యాధులతో బాధపడేవారు కూడా ఆరు బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ట్రాఫిక్ కూడళ్లు, వ్యాపార కేంద్రాలున్న చోట నివసించే ఆస్తమా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పీసీబీ శాస్త్రవేత్త వీరన్న పేర్కొన్నారు.