Twitter: ట్విట్టర్లో విమర్శకులను బ్లాక్ చేయడం కుదరదయ్యా ట్రంపూ!: తేల్చి చెప్పిన ఫెడరల్ జడ్జ్
- అభిప్రాయాలు నచ్చకపోతే పట్టించుకోవద్దు
- వారిని బ్లాక్ చేయడం రాజ్యాంగ విరుద్ధం
- న్యూయార్క్ సదర్న్ డిస్ట్రిక్ జడ్జ్ స్పష్టీకరణ
మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో విమర్శకులను బ్లాక్ చేయవద్దని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ఫెడరల్ జడ్జ్ ఆదేశించారు. యూజర్లను బ్లాక్ చేయడం అమెరికా రాజ్యాంగంలోని మొదటి సవరణ అయిన మాట్లాడే స్వేచ్ఛా హక్కుకు ఉల్లంఘన అవుతుందని న్యూయార్క్ సదర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జ్ నవోమిరీస్ బుచ్ వాల్డ్ స్పష్టం చేశారు.
‘‘ట్రంప్ ట్విట్టర్ ఖాతా పబ్లిక్ ఫోరం వంటిది. ఆయన ట్వీట్లకు భిన్నమైన అభిప్రాయాలతో స్పందించే వారిని బ్లాక్ చేయడం వివక్ష కిందికే వస్తుంది. ఇది రాజ్యాంగంలోని మొదటి సవరణకు ఉల్లంఘనే’’ అని న్యాయవాది వాదించారు. ట్రంప్ ట్వీట్లకు తమ స్వేచ్ఛ కొద్దీ స్పందించిన ఏడుగురిని ఆయన బ్లాక్ చేశారు. వీరి తరఫున కొలంబియా యూనివర్సిటీలోని నైట్ ఫస్ట్ అమెండెమెంట్ ఇనిస్టిట్యూట్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. విచారణ తర్వాత జడ్జి 75 పేజీలతో తీర్పును జారీ చేశారు. నచ్చని ట్వీట్లను పట్టించుకోవద్దని, అంతేకానీ, వారిని బ్లాక్ చేయవద్దని ఆదేశించారు.