Donald Trump: 'మన భేటీ రద్దు'.. ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌కి డొనాల్డ్ ట్రంప్ లేఖ
- కిమ్‌తో భేటీకి ఆస్తక్తిగా ఎదురు చూశా
- దురదృష్టవశాత్తూ ఇటీవల కిమ్ ఓ ప్రకటన చేశారు
- అమెరికాపై ఎంతో ద్వేషం, శత్రుత్వం ప్రదర్శించారు
- ఇక నాకు ఈ సమావేశం అనవసరమనిపించింది
వచ్చేనెల 12న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సమావేశం కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు కిమ్ జాంగ్ ఉన్‌కు డొనాల్డ్ ట్రంప్ ఓ లేఖ రాసి, సమావేశం రద్దు చేసుకుంటున్నట్టు చెప్పారు. ఈ విషయంపై వైట్ హౌస్ నుంచి ఓ ప్రకటన కూడా వెలువడింది.
కిమ్‌తో సమావేశమవ్వడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూశానని ట్రంప్ లేఖలో పేర్కొన్నట్లు అందులో ఉంది. అయితే, దురదృష్టవశాత్తూ ఇటీవల కిమ్ తాను చేసిన ప్రకటనల్లో అమెరికాపై ఎంతో ద్వేషం, శత్రుత్వం ప్రదర్శించారని, దీంతో ఇటువంటి పరిస్థితుల్లో దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఈ సమావేశం తనకు అనవసరమనిపించిందని ట్రంప్ అన్నారు.
కాగా, ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడకముందు ఉత్తరకొరియా తమ ‘ప్యుంగే-రి’ అణు పరీక్షా కేంద్రంలోని సొరంగాలను ధ్వంసం చేసింది. చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్, దక్షిణకొరియాల జర్నలిస్టుల సమక్షంలో అణు పరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేసే ప్రక్రియ జరిగింది. ఉత్తరకొరియా ఇటీవల శాంతి చర్చలకు ఒప్పుకున్న విషయం తెలిసిందే.