TTD: శ్రీవారిపైనా ఈ నిరసన?... టీటీడీ ఉద్యోగులను ప్రశ్నిస్తున్న భక్తులు!
- నల్ల బ్యాడ్జీలను ధరించి విధుల్లోకి వచ్చిన సిబ్బంది
- స్వామివారి ఆలయంలో ఉద్యోగులతో భక్తుల వాగ్వాదం
- నల్ల బ్యాడ్జీలు ధరించ వద్దని సర్క్యలర్ జారీ చేసిన టీటీడీ
తిరుమలలో తొలగించబడ్డ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు చేసిన విమర్శలు, సంధించిన ప్రశ్నలకు నిరసనగా టీటీడీ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడాన్ని భక్తులు తీవ్రమైన తప్పుగా పరిగణిస్తున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించిన సిబ్బంది, అర్చకులను స్వామివారి ఆలయంలో చూసిన భక్తులు, అక్కడే వారిని నిలదీశారు.
ఈ నిరసన ఎవరిపై తెలుపుతున్నారని, స్వామివారిపై నిరసన తెలపడం ఏంటని, రాజకీయాల కోసం ఇలా చేయడం సరికాదని సిబ్బందిని నిలదీశారు. ఆలయ చరిత్రలోనే తొలిసారిగా ఇలా జరిగిందని, రమణ దీక్షితులుపై నిరసన తెలపాలంటే, ఆయన ఇంటి వద్ద నిరసన తెలియజేయాలిగానీ, ఇలా ఆలయానికి నల్ల బ్యాడ్జీలు ధరించి రావడం ఏంటని ప్రశ్నించారు. టీటీడీ ఉద్యోగుల చర్యలతో తిరుమల ఆలయం ప్రతిష్ఠ దిగజారుతోందని విమర్శించారు.
కాగా, భక్తుల నుంచి వస్తున్న కామెంట్ల గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు వద్దని ఓ సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం.