Pawan Kalyan: నిరాహారదీక్షకు ముందు టీడీపీ ప్రభుత్వం ముందు జనసేన పెట్టిన డిమాండ్ల లిస్ట్ ఇదిగో!
- రాష్ట్ర ప్రభుత్వం ముందు జనసేన డిమాండ్లు
- రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం సమన్వయం చేసుకుని పని చేయాలి
- కాసేపట్లో నిరాహారదీక్షకు దిగనున్న పవన్ కల్యాణ్
ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 గంటల పాటు నిరాహారదీక్షకు దిగుతున్నారు. కాసేపట్లో ఆయన దీక్ష ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ముందు జనసేన పలు డిమాండ్లు ఉంచింది. ఆ డిమాడ్లు ఇవే...
- ఉద్దానంలోని అన్ని గ్రామాల్లో మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కిడ్నీ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించాలి.
- ప్రతి డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ వ్యాధులకు సంబంధించి శిక్షణ పొందిన పారా మెడికల్ సిబ్బందిని నియమించాలి. వారానికి ఒకసారి డయాలసిస్ కేంద్రానికి నెఫ్రాలజిస్టు వెళ్లి చికిత్స అందించాలి.
- డయాలసిస్ కేంద్రాలను పెంచాలి. ఈ కేంద్రాలకు అనుబంధంగా బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలి.
- కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మందులను ఉచితంగా అందించాలి.
- డయాలసిస్ చేయించుకునేవారికి... అన్ని స్టేజుల్లో ఉన్నవారందరికీ పింఛన్లు అందించాలి.
- కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి.
- శుద్ధి చేసిన నీటిని ప్రతి గడపకూ అందించాలి.
- వ్యాధి ప్రబలడానికి మూలాలను అన్వేషించేందుకు పరిశోధన కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి.
- ముఖ్యమంత్రి స్వయంగా ఉద్దానం కిడ్నీ సమస్య, నివారణ చర్యలను పర్యవేక్షించాలి. దీని కోసం స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేయాలి.
- ఉద్దానంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి.
- రాష్ట్రానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని వెంటనే నియమించాలి.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా జనసేన ఓ సూచన చేసింది. ఉద్దానం సమస్య తమ పరిధిలోకి రాదని కేంద్ర ప్రభుత్వం తప్పించుకోరాదని... రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం సమన్వయం చేసుకుంటూ తగిన సహాయసహకారాలను అందించాలని కోరింది.