Narendra Modi: మెగా 'టైమ్స్' పోల్ లో మోదీకే పట్టం కట్టారు!
- టైమ్స్ గ్రూప్ సర్వేలో మోదీకి బ్రహ్మరథం
- రెండింట మూడొంతుల మంది ఓటు బీజేపీకే
- మోదీ నాలుగేళ్ల పాలన ‘వెరీగుడ్’ అన్న 47.4 శాతం మంది
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడక కాదని ఏబీపీ-సీఎస్డీఎస్ సర్వేలో తేలగా, తాజాగా టైమ్స్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో మళ్లీ అధికారంలోకి వచ్చేది మోదీయేనని తేలింది.
మోదీ ప్రధాని పదవి చేపట్టి నేటితో నాలుగేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో ‘టైమ్స్’ గ్రూప్ సర్వే నిర్వహించింది. ‘పల్స్ ఆఫ్ ది నేషన్’ పేరుతో నిర్వహించిన ఈ పోల్‌లో పాల్గొన్న వారిలో మూడింట రెండొంతుల మంది మోదీకి జై కొట్టారు. సర్వేలో మొత్తం 8,44,646 మంది పాల్గొనగా వారిలో 71.9 శాతం మంది తాము మోదీకే ఓటేస్తామని చెప్పారు. ఇప్పటికిప్పుడు (ఈరోజు) ఎన్నికలు జరిగితే తామంతా మోదీకే ఓటేస్తామని పేర్కొన్నారు. మోదీ సారథ్యంలోని ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని 73.3 శాతం మంది అభిప్రాయపడ్డారు.
అలాగే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మోదీ అభ్యర్థిత్వాన్నే బలపరుస్తామని అత్యధిక శాతం మంది చెప్పగా, 16.1 శాతం మంది మాత్రం మోదీకి, రాహుల్ గాంధీకి ఇద్దరికీ వేయబోమని పేర్కొన్నారు. కాగా, 11.93 శాతం మంది కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ఓటేశారు.
మే 23-25 మధ్య 9 భాషల్లో టైమ్స్ గ్రూప్‌కు చెందిన 9 సంస్థలు ఈ ఆన్లైన్ సర్వేను నిర్వహించాయి. మోదీ నాలుగేళ్ల పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు 47.4 శాతం మంది ‘వెరీ గుడ్’ అని, 20.6 శాతం మంది ‘గుడ్’ అని, 11.38 శాతం మంది ‘యావరేజ్’ అని బదులిచ్చారు. 20.55 శాతం మంది మాత్రం అస్సలు బాగాలేదని చెప్పుకొచ్చారు.