Andhra Pradesh: రిసార్ట్ లో దీక్ష చేయడం కొత్త ఫ్యాషనేమో!: పవన్ పై అశోక్ గజపతిరాజు సెటైర్లు
- హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే ఆసుపత్రిలో దీక్ష చేయాలి.. రిసార్ట్ లో కాదు
- తొలిసారిగా రిసార్ట్ లో దీక్ష చేయడం చూస్తున్నా!
- కార్యకర్తలను ఆదుకుంటున్న ఏకైక పార్టీ టీడీపీయే
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిరాహార దీక్షకు దిగారు. నిన్న రిసార్ట్ లో దీక్ష చేసిన పవన్, ఈరోజు ప్రజల మధ్య తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. పవన్ దీక్ష నేపథ్యంలో టీడీపీ నేత అశోక్ గజపతిరాజు విమర్శలు గుప్పించారు.
ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే ఆసుపత్రిలో దీక్ష చేయాలి కానీ, రిసార్ట్ లో కాదని, తొలిసారిగా రిసార్ట్ లో దీక్ష చేయడం చూస్తున్నానని, ఇది కొత్త ఫ్యాషనేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా తమ పార్టీ గురించి ఆయన ప్రస్తావిస్తూ కార్యకర్తలను ఆదుకుంటున్న ఏకైక పార్టీ టీడీపీ అని, కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంటే ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రజలకిచ్చే పింఛన్ డబ్బులను బ్రోకర్లు తినేసేవారని, తమ ప్రభుత్వం అలా కాదని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పారు.