India: ఇండియా-శ్రీలంక గాలె టెస్ట్ ఫిక్స్.. ప్రకంపనలు సృష్టిస్తున్న అల్ జజీరా కథనం!
- భారత్-శ్రీలంక, ఆస్ట్రేలియా-శ్రీలంక టెస్టులు ఫిక్స్
- ప్రసారానికి ముందు సంచలనం సృష్టిస్తున్న కథనం
- రంగంలోకి ఐసీసీ.. దర్యాప్తు ప్రారంభం
గతేడాది భారత్-శ్రీలంక జట్ల మధ్య గాలెలో జరిగిన టెస్ట్, అదే వేదికపై 2016లో ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లు ఫిక్సయ్యాయంటూ ఖతర్‌కు చెందిన మీడియా నెట్వర్క్ ‘అల్ జజీరా’ సంచలన కథనాన్ని ప్రచురించింది. గ్రౌండ్ సిబ్బందికి డబ్బులు ముట్టజెప్పిన ‘క్రిమినల్స్’ పిచ్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్నారని కథనంలో పేర్కొంది. ఈ ఏడాది నవంబరులో ఇంగ్లండ్-శ్రీలంక మధ్య గాలెలో జరగనున్న టెస్టును కూడా ఫిక్స్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు షాకింగ్ వివరాలు బయటపెట్టింది. ‘క్రికెట్స్ మ్యాచ్ ఫిక్సర్స్’ పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించిన అల్ జజీరా ఈ ఉదయం 10 గంటలకు దానిని ప్రసారం చేయనుంది.
అల్ జజీరా కథనం సంచలనం సృష్టించడంతో రంగంలోకి దిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. అల్ జజీరా ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ అవినీతి విభాగం అధికారులతో దర్యాప్తు ప్రారంభించినట్టు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.
‘ది ఆస్ట్రేలియన్’ కథనం ప్రకారం.. దర్యాప్తు కోసం అల్ జజీరా హైడెన్ కెమెరాలు ఉపయోగించింది. భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రాబిన్ మోరిస్, దుబాయ్‌కి చెందిన భారత వ్యాపారవేత్త గౌరవ్ రాజ్‌కుమార్, గాలె స్టేడియం అసిస్టెంట్ మేనేజర్ తరంగలు కలిసి ఫిక్సింగ్ కోసం జరుపుతున్న చర్చలను అల్ జజీరా రహస్య కెమెరాలు రికార్డు చేశాయి. ఈ వీడియోలో శ్రీలంక ఫస్ట్ క్లాస్ క్రికెటర్ థరిందు మెండిస్ కూడా ఉన్నాడు. కాగా, అల్ జజీరా చానల్ రహస్య ప్రతినిధులతో రాబిన్ మోరిస్ మాట్లాడుతూ పిచ్‌ను తమకు అనుకూలంగా మార్చడానికి గాలె గ్రౌండ్ సిబ్బందికి లంచం ఇచ్చినట్టు అంగీకరించాడు.
బ్యాటింగ్‌కు అనుకూలంగా మార్చిన ఈ పిచ్‌పై భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు చేయగా, సెకెండ్ ఇన్నింగ్స్‌ను 240/3 వద్ద డిక్లేర్ చేసింది. ఇదే బ్యాటింగ్ పిచ్‌పై శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 291, రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేసి ఓటమి పాలైంది. ప్రసారం కాకముందే ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కథనం.. ప్రసారమయ్యాక మరెంత అలజడి సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.