Crude Oil: భారీగా పడిపోయిన క్రూడాయిల్ ధర!
- ఉత్పత్తిని పెంచాలని రష్యా, సౌదీ అరేబియా నిర్ణయం
- 2.69 డాలర్లు పడిపోయిన బ్రెంట్ క్రూడ్
- 3.04 డాలర్లు తగ్గిన వెస్ట్ టెక్సాస్ క్రూడాయిల్
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పతనం అయ్యాయి. ఒపెక్ దేశాలతో పాటు రష్యా సైతం మరింత క్రూడాయిల్ ను వెలికితీసి మార్కెట్లోకి పంపాలని నిర్ణయించగా, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఏకంగా 2.69 డాలర్లు పడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే 3.4 శాతం తగ్గి 76.10 డాలర్లకు క్రూడాయిల్ చేరుకుంది. 2014 తరువాత గత వారాంతంలో 80 డాలర్లను దాటిన క్రూడాయిల్ ధర తిరిగి 76 డాలర్ల స్థాయికి రావడంతో, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతాయని చమురు రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక యూఎస్ వెస్ట్ టెక్సాస్ క్రూడాయిల్ ధర ఏకంగా 4.3 శాతం పడిపోయి 3.04 డాలర్లు తక్కువగా 67.67 డాలర్లకు చేరింది. ఆరు వారాల పాటు ఆగకుండా పరుగులు పెట్టిన క్రూడాయిల్ మార్కెట్ లో, ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరిస్తుండటం కూడా ధరల పతనానికి కారణమని తెలుస్తోంది.
సెయింట్ పీటర్స్ బర్గ్ లో సమావేశమైన సౌదీ అరేబియా, రష్యా చమురు మంత్రులు, ఉత్పత్తిని పెంచాలని, వచ్చే నెలలో వియన్నాలో జరిగే ఒపెక్ సమావేశంలో మిగతా సభ్య దేశాలతో కలసి దీనిపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ముడి చమురు ఉత్పత్తిని ఒపెక్ దేశాలు పెంచినప్పుడల్లా, ధర ఒత్తిడికి లోనై, పడిపోతుందన్న సంగతి తెలిసిందే.