Narendra Modi: మన అమ్మాయిలా మజాకా... ఎందులోనూ తీసిపోరు: నరేంద్ర మోదీ
- ఎక్కడ కాలు పెట్టినా విశేషంగా రాణిస్తున్న మహిళలు
- ఎన్ఎస్వీ తరణి బృందంపై ప్రశంసల వర్షం
- 'మన్ కీ బాత్'లో మాట్లాడిన ప్రధాని మోదీ
భారత మహిళలు, తాము అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ విశేషంగా రాణిస్తున్నారని, ఎంచుకున్న ఏ రంగంలోనూ తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి 'మన్ కీ బాత్' (మనసులో మాట) ప్రసంగాన్ని చేసిన ఆయన, సముద్ర మార్గంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ఐఎన్ఎస్వీ తరిణి బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. వారంతా విజేతలేనని, వారి సాహసంతో దేశానికి కీర్తిప్రతిష్ఠలు వచ్చాయని, నావికాదళం శక్తి దేశానికి తెలిసొచ్చిందని అన్నారు.
పదహారేళ్ళ శివాంగి పాఠక్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డును సృష్టించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు మోదీ తెలిపారు. అజిత్ బజాజ్, ఆయన కుమార్తె ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి తండ్రీ కూతుళ్ళుగా నిలిచారని తెలిపారు. 50 ఏళ్ళ వయసుపైబడిన సంగీతా భల్ కూడా ఇదే పర్వతాన్ని అధిరోహించి, సంచలనం సృష్టించారని, మహిళల శక్తికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని అన్నారు.