TSRTC: అంత అజాగ్రత్తగా బస్సును ఎలా నడిపావు?: బస్ డ్రైవర్ ను ప్రశ్నించిన టీఎస్ ఆర్టీసీ చైర్మన్
- డ్రైవర్ నిర్లక్ష్యానికి 13 నిండు ప్రాణాలు బలి
- ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న డ్రైవర్ మల్లయ్య
- 30 ఏళ్ల అనుభవమున్నా ఇంత నిర్లక్ష్యమా
- మండిపడ్డ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ
తెలంగాణ ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి 13 నిండు ప్రాణాలు బలికాగా, చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ రమణారావు. ప్రమాదానికి కారణమైన రాజధాని బస్సు డ్రైవర్ దామల మల్లయ్యపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లా కౌడిపల్లికి చెందిన మల్లయ్య, 1989 నుంచి బస్సు డ్రైవర్ గా ఉండగా, అతన్ని అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్న సోమారపు, 30 సంవత్సరాల అనుభవముండి, అంత అజాగ్రత్తగా బస్సును ఎలా నడిపావని మండిపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఇంత ఘోరం జరిగిందని వ్యాఖ్యానించిన ఆయన, ఆర్టీసీ తరఫున మృతులకు రూ. 2 లక్షల పరిహారాన్ని అందిస్తామని తెలిపారు.
కాగా, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇల్టం నర్సింలు నిన్న మరణించాడు. ఆయన తమ్ముడి భార్య లక్ష్మి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్టు గాంధీ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.