Chandrababu: ఎన్టీఆర్ కు నివాళి అర్పించి.. చంద్రబాబును కడిగిపారేసిన లక్ష్మీపార్వతి
- నారా కుటుంబాన్ని రాజకీయాల నుంచి బహిష్కరించాలి
- ఎన్టీఆర్ వారసులు టీడీపీ పగ్గాలు చేపట్టాలి
- కాంగ్రెస్ కు టీడీపీని తాకట్టుపెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నారా కుటుంబాన్ని రాజకీయాల నుంచి బహిష్కరించాలని అన్నారు. ఎన్టీఆర్ వారసుల్లో ఒకరు టీడీపీ పగ్గాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ వారసుల్లో కేవలం బాలకృష్ణకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, మిగిలిన వారిని పక్కన పెట్టేశారని మండిపడ్డారు. చివరకు హరికృష్ణ స్థాయిని కూడా దిగజార్చారని విమర్శించారు.
టీడీపీని ఆత్మవంచన పార్టీగా మార్చి, పార్టీని అమ్మేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఒక పెద్ద ఆక్టోపస్ అని, రాబందు అని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకే ఎన్టీఆర్ ను చంద్రబాబు గద్దె దించారని ఆరోపించారు. ఎన్టీఆర్ ప్రధాని కాకుండా ఆనాటి కాంగ్రెస్ ప్రధానితో చంద్రబాబు చేతులు కలిపారనే విషయం తమకు తెలిసిందని చెప్పారు.
హైదరాబాదులో ఎన్టీఆర్ గత జయంతి వేడుకలకు, ఇప్పటి వేడుకలకు చాలా తేడా ఉందని ఆమె అన్నారు. ఘాట్ పరిసరాలు, రోడ్డుకు ఎలాంటి అలంకరణలు లేకుండా, బోసిగా ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను టీడీపీకి దూరం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు.