by elections: నాలుగు లోక్ సభ, పది శాసన సభ స్థానాల్లో నేడు ఉప ఎన్నికల పోలింగ్
- ఈ నెల 31న ఫలితాల వెల్లడి
- మరోసారి బీజేపీ-ప్రతిపక్షాల మధ్య కీలక పోరు
- బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాల ఐక్యత రాగం
ఇటీవల జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికలు గుర్తుండే ఉంటాయి. ఎన్నికల ముందు ఎవరికి వారే యమునా తీరే మాదిరిగా పార్టీలు విడిగా పోటీ చేయగా, ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కటై బీజేపీని అధికారం విషయంలో బోల్తా కొట్టించాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇక మీదట కలసికట్టుగా బీజేపీపై పోరాటం చేసి ఘన విజయం సాధించాలన్నది ప్రతిపక్షాల వ్యూహం. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు రాష్ట్రాల్లో లోక్ సభ, శాసన సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి పట్ల ఎంతో ఆసక్తి నెలకొంది.
మహారాష్ట్రలోని పాల్ఘర్, భనారా-గోండియా లోక్ సభ స్థానాలు, యూపీలోని కైరాన లోక్ సభ స్థానం, నాగాలాండ్ లోక్ సభ స్థానంలో ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అలాగే, శాసన సభ స్థానాలను గమనిస్తే జార్ఖండ్ లోని గోమినా, సిల్లి, యూపీలోని నూర్పూర్, పంజాబ్ లోని షాష్ కోట్, బిహార్ లోని జోకిహాట్, కేరళలోని చెంగన్నూర్, మహారాష్ట్రలోని పాలస్ కడేగాన్, మేఘాలయలో అంపతి, ఉత్తరాఖండ్‌లోని తరాలి, వెస్ట్ బెంగాల్ లోని మహేష్టల స్థానాల్లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఫలితాలను ఈ నెల 31న ప్రకటించనున్నారు. ఈ స్థానాల్లో ప్రతిపక్షాలు కలసి కట్టుగా సాగడం విశేషం.