First S*x: 19 ఏళ్లలోపే అమ్మాయిలకు తొలి అనుభవం... జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించిన లైంగిక జీవిత గణాంకాలు!
- సర్వే వివరాలు వెల్లడించిన ఎన్ఎఫ్ హెచ్ఎస్
- దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో చురుకుగా లైంగిక జీవితం
- తెలంగాణతో పోలిస్తే ఏపీలో మెరుగైన లైంగిక జీవితం
అత్యధిక శాతం మంది అమ్మాయిలు 19 సంవత్సరాల వయసులోపే తొలి లైంగిక అనుభవాన్ని పొందుతున్నారని, 15 నుంచి 19 ఏళ్ల మధ్యలో వారు లైంగిక జీవితాన్ని రుచి చూస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్ హెచ్ఎస్) భారతీయుల లైంగిక జీవితంపై సర్వే నిర్వహించి రిపోర్టును విడుదల చేసింది. ఈ రిపోర్టుతో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాదితో పోలిస్తే, ఉత్తరాదిలోని వారు లైంగిక జీవితాన్ని మెరుగ్గా పొందుతున్నారని, పురుషుల్లో 20 నుంచి 24 ఏళ్లలోపు తమ తొలి అనుభవాన్ని పొందుతున్నారని తెలిపింది. 2015-16లో ఈ సర్వేను నిర్వహించిన ఎన్ఎఫ్ హెచ్ఎస్ దాని వివరాలను తాజాగా విడుదల చేసింది. వివిధ గ్రూపుల వయసులో ఉన్న లక్ష మంది పురుషులు, మరో లక్ష మంది మహిళలను సర్వేలో భాగం చేశారు.
ఈ సర్వేలోని వివరాల ప్రకారం, 10 నుంచి 14 ఏళ్ల వయసున్న వారిలో 2 శాతం పురుషులు, 10 శాతం స్త్రీలకు లైంగిక అనుభవం దగ్గరవుతోంది. ఇక 15 నుంచి 19 ఏళ్ల మధ్య 23 శాతం పురుషులు, 57 శాతం స్త్రీలు, 20 నుంచి 24 ఏళ్ల మధ్య 42 శాతం మంది పురుషులు, 24 శాతం మంది స్త్రీలు, 24 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 23 శాతం మంది పురుషులు, 5 శాతం మంది స్త్రీలు తొలి లైంగికానందాన్ని పొందుతున్నారు. 30 ఏళ్ల తరువాత మాత్రమే 10 శాతం మంది పురుషులకు ఆ ఆనందం దగ్గరవుతుండగా, ఈ గ్రూప్ లో కేవలం ఒక్క శాతం మంది ఆడవారు మాత్రమే ఉండటం గమనార్హం.
అమ్మాయిలకు యుక్త వయసులో వివాహం అవుతుండటంతోనే వారు అబ్బాయిలతో పోలిస్తే తొందరగా తొలి అనుభవాన్ని పొందుతున్నారని ఎన్ఎఫ్ హెచ్ఎస్ తెలిపింది. పెళ్లికి ముందు సెక్స్ పై నిషేధం ఉన్నప్పటికీ, 24 ఏళ్లలోపు పురుషుల్లో 11 శాతం మంది, స్త్రీలలో 2 శాతం సెక్స్ లో పాల్గొన్నట్టు వెల్లడించారు.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 35 శాతం మంది, ఆంధ్రప్రదేశ్ లో 45 శాతం మంది తాము చాలా రోజుల నుంచి సెక్స్ లో చురుకుగా పాల్గొంటున్నట్టు వెల్లడించారు. అనుకోకుండా కలిసిన అమ్మాయితో లైంగికానందం పొందామని చెప్పిన పురుషుల శాతం 20గా ఉండగా, తొలి అనుభవం కోసం వేశ్యను ఆశ్రయించామని చెప్పిన వారి శాతం 16గా ఉంది. ఇక తమ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ తో కలిశామని 68 శాతం మంది పురుషులు, 64 శాతం మంది స్త్రీలు వెల్లడించారు.