Vijayawada: 2019లో బీజేపీనే మాకు ప్రధాన ప్రత్యర్థి: మంత్రి లోకేశ్
- ఐసీయూలో ఉన్న వైసీపీకి బీజేపీ ఆక్సిజన్ అందిస్తోంది
- పొరపాటున వైసీపీకి ఎవరైనా ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే
- బీజేపీ నటులు, కుల సంఘాలను రంగంలోకి దించింది
2019లో బీజేపీనే తమకు ప్రధాన ప్రత్యర్థి అని, ఐసీయూలో ఉన్న వైసీపీకి బీజేపీ ఆక్సిజన్ అందిస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. విజయవాడలో రెండో రోజు టీడీపీ మహానాడు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలో పాల్గొన్న లోకేశ్ మాట్లాడుతూ, పొరపాటున వైసీపీకి ఎవరైనా ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు.
బీజేపీ సొంతంగా ఏమీ చేయలేక కొత్త నటులు, కుల సంఘాలను రంగంలోకి దించిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు భారీ మెజార్టీతో గెలిచి మళ్లీ సీఎం కావడం ఖాయమని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, రెండో రోజు మహానాడులో 16 తీర్మానాలు చేశారు. ఇందులో ఏపీకి సంబంధించి 9, తెలంగాణకు సంబంధించి 4 తీర్మానాలు ఉన్నాయి. తెలుగుదేశం మహానాడులో మూడు ఉమ్మడి తీర్మానాలు చేశారు.